HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది.

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి | ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోధ్యన్యత్క్షత్రియస్య న విద్యతే || “ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక యోధుడికి పోరాడడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు” అని భగవద్గీత శ్లోకంలోని భావం. “శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తున్నాం” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు హితోపదేశం చేశారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం అంటూ గర్జించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది అనేది ఎన్నో అనుభవాలు చాటుతూనే ఉన్నాయి. ఇటీవల చెన్నై, వయనాడ్‌లో అలాంటి పరిస్థితులను చూశాం. ఏడాది క్రితం హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగేళ్ల క్రితం చార్‌దామ్‌లో ప్రకృతి విరుచుకుపడితే ఎంతటి విధ్వంసం ఉంటుందో ఊహకందని ఆ విలయం కళ్లముందు కదలాడుతూనే ఉంది. భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. “నీవు ప్రకృతితో ఆడుకుంటే.. ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది” అని అంటాడు పర్యావరణ శాస్త్రవేత్త. అందుకే భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూనుకోవడం అభినందించదగ్గ పరిణామం. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం, దానికి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్‌ను ఛైర్మన్‌గా నియమించడమే ఓ విప్లవాత్మకం. “అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని...




