హైదరాబాద్, అక్టోబర్ 7: హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం మొత్తం గిన్నీస్ వరల్డ్ రికార్డులను వరుసగా సొంతం చేసుకుంటున్నారు. తాజాగా మరో మూడు రికార్డులు కొల్లగొట్టిన ఈ ఫ్యామిలీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ శివాలి జోహ్రీ శ్రీవాస్తవ, ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవ కలిసి 18, 19, 20వ గిన్నిస్ రికార్డులు సాధించి మైలురాయిని సాధించారు. పలు రకాల ఓరిగామి బొమ్మల తయారీలో ఈ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మళ్లీ చోటు దక్కించుకున్నారు. గతంలోనూ వీరి పేరిట 17 గిన్నీస్ రికార్డులు ఉండగా.. తాజాగా మరో మూడు దక్కాయి. దీంతో మొత్తం ఈ ఫ్యామిలీ అకౌంట్లో 20 గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి.
3,400 ఓరిగామి నెమళ్లు, 4,400 ఓరిగామి షర్టులు, 3,200 ఓరిగామి పందులను అతిపెద్ద ప్రదర్శన కోసం తయారు చేశారు. ఇందుకు సాక్ష్యంగా వీడియోను గిన్నీస్ అధికారులకు సమర్పించారు. ఈ ఫీట్‌ను వారు అధికారికంగా నిర్ధారించారు. తాజా రికార్డులతో శ్రీవాస్తవ కుటుంబం హైదరాబాద్‌లో అత్యధికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లు కలిగి ఉన్న కుటుంబంగా గుర్తింపు పొందింది. గీతం హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డిఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ఆర్ వర్మ, డాక్టర్ మల్లికార్జున్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఒరిగామి కళాకారిణి అయిన శివాలి జోహ్రీ శ్రీవాస్తవ.. చేతితో తయారు చేసిన క్విల్డ్ పువ్వులు, ఓరిగామి తిమింగలాలు, పెంగ్విన్‌లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, కుక్కలు, డైనోసార్‌లు, పందులతో సహా వివిధ కాగితపు బొమ్మలను తయారు చేసి గతంలో 17 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నెలకొల్పింది. వీటిల్లో 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, 10 యూనిక్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి. శివాలి తయారు చేసిన కాగితం బొమ్మలు (ఒరిగామి బొమ్మలు) GITAM యూనివర్సిటీ వేదికగా నిలిచింది. ఆమె తాను తయారు చేసిన కాగితం బొమ్మలను గీతం యూనివర్సిటీలో ప్రదర్శనకు ఉంచింది.