Hyderabad: సరదాగా ఆన్‌లైన్ గేమింగ్.. తొలుత డబ్బులు రావడంతో అదే పని.. చివరకు
ఐదు రూపాయలు పెట్టండి ఐదు వేలు పట్టండి. నేను ఈ గేమ్ ఆడుతున్నాను. నా అకౌంట్ చూడండీ వేల రూపాయలతో ఎలా నిండిపోతుందో. ఇదీ ఆన్ లైన్ గేమ్ యాప్స్ కి సంబంధించిన యాడ్ల వెల్లువ. ఇపుడంతా ఆన్ లైన్ గేమింగ్ యాప్ జమానా. ఎక్కడ చూసినా ఆన్ లైన్ గేమ్స్ కి సంబంధించిన ప్రకటనలే. వాటికి అట్రాక్ట్ అయి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు...

ఆన్లైన్ గేమ్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. వినోదంగా మొదలైన ఈ గేమింగ్ వ్యసనం, కొన్నిసార్లు వారి జీవితాలను తల్లకిందులు చేస్తోంది. ఈ పరిణామమే హైదరాబాద్‌లో నివసించే 23 ఏళ్ల యువకుడు అరవింద్ విషాదాంతానికి దారితీసింది. అరవింద్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని ఖానామెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఆదిలో కేవలం సరదాగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసిన అరవింద్‌కి, క్రమంగా గేమింగ్ వ్యసనంగా మారింది. డబ్బును పెట్టుబడి పెట్టి ఆడే గేమింగ్ యాప్స్ అతడిని ఆకర్షించాయి. మొదట్లో కొంత డబ్బు గెలిచాడు. ఆ తర్వాత పెరిగిన ఆశ, అతన్ని మరింతగా డబ్బు పెట్టేలా చేసింది. అరవింద్ మొదట కొద్ది మొత్తంలోనే డబ్బులు పెట్టేవాడు. కానీ, గెలవాలని తపన పెరిగిన కొద్దీ… పెద్ద మొత్తాల్లో డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. ఒక దశలో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు గెలిచినా, అధిక శాతం నష్టపోయేవాడు. చివరకు, తన వద్ద డబ్బు మొత్తాన్ని గేమింగ్‌లో పోగొట్టి, అప్పు తీసుకునే వరకు వెళ్లాడు.
తన ఆటల వల్ల ఇంట్లో రోజుకో సమస్య వస్తుండటంతో తల్లిదండ్రులు అతడిని మందలించారు. ఇది అరవింద్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయాడు. అతడిని వెతికి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం రాత్రి కూడా అరవింద్ ఆన్లైన్ గేమ్‌లో మరో రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఇది అతడికి తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. తల్లిదండ్రులకు తిరిగి ఆ డబ్బును ఎలా తిరిగి చెల్లించాలి అన్న భయం కూడా కలిగింది. మనోవేదనలో ఉన్న అతడు తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాత్రి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనతో అరవింద్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గేమింగ్ వ్యసనం ఆర్థికంగా, మానసికంగా యువతను కుంగదీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..