మరికొన్ని రోజుల్లో 2022 ముగియనుంది. కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నగరవాసుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్ యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఏటా ఎక్కడో ఒకచోట అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో హైదరాబాద్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నగరంలో నిబంధనలు, ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకలను రాత్రి ఒంటిగంట వరకూ నిర్వహించుకునేందుకు త్రీస్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు, యాజమాన్యాలు 10 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని తెలిపారు.
వేడుకల్లో అసభ్యకర డ్యాన్స్‌లు, గొడవలు, అల్లర్లు జరగకుండా చూడాలని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు. మారణాయుధాలను వేడుకల ప్రాంతాల్లోకి అనుమతించకూడదని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల కోసంప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని సూచించారు. పబ్బులు, క్లబ్బులు, బార్లలో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకల్లో డ్రగ్స్ సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని, వారు ఇంటికి చేరేలా చూసే బాధ్యత కూడా యాజమాన్యాలదేనని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..