హైదరాబాద్, జూన్ 26: కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా వేదికగా ఎందరో యువత ఆన్‌లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు లోన్ యాప్‌లో అప్పులు తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ కాసి నిండా మునిగాడు. చివరకు అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదారబాద్ నగరంలోని ఉప్పల్ పరిధి ఈస్ట్ కల్యాణపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధి ఈస్ట్ కల్యాణపురికి చెందిన అర్జున్ రావు అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఈక్రమంలో తన వద్ద ఉన్నదంతా పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. తెలిసిన వారి వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీరకపోగా.. పీకల్లోతు మునిగిపోయాడు. అప్పుల బాధ భరించలేక అర్జున్ రావు తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థికంగా నష్టపోయిన సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేసి మాయ చేస్తున్నారు. తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత వారి ట్రాప్‌లోకి లాగి అందినకాడికి దోచేస్తున్నారు. ధనిక, పేద, మధ్య తరగతి, ఉద్యోగులు, యువత అనే తేడా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని విలవిల లాడుతున్నారు. నిత్యం ఒక్కటో ఒకచోట ఎవరో ఒకరు వీరి చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కార్రక్యమాలు నిర్వహించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. తాజాగా ఉప్పల్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో వ్యక్తి ప్రాణాలు తీసుకోవడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చణీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.