Twin Daughters: పుట్టిన 2 రోజులకే కవల కూతుళ్లను చంపిన తండ్రి! ఎందుకో తెలిస్తే రక్తం మరుగుద్ది..
ఈ సాంకేతిక యుగంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కొడుకు పుట్టలేదన్న అక్కసుతో ఓ మానవ మృగం అప్పుడే పుట్టిన కవల పసికందులను పొట్టన పెట్టుకున్నాడు. లోకం చూడకముందే ఆ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత పురిటి బిడ్డలను కారులో ఎత్తుకెళ్లి దారుణంగా హతమార్చాడు. కవల ఆడపిల్లల మృతదేహాలను ఓ చోట పాతిపెట్టి పరారయ్యాడు...
న్యూఢిల్లీ, జూన్ 24: ఈ సాంకేతిక యుగంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కొడుకు పుట్టలేదన్న అక్కసుతో ఓ మానవ మృగం అప్పుడే పుట్టిన కవల పసికందులను పొట్టన పెట్టుకున్నాడు. లోకం చూడకముందే ఆ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత పురిటి బిడ్డలను కారులో ఎత్తుకెళ్లి దారుణంగా హతమార్చాడు. కవల ఆడపిల్లల మృతదేహాలను ఓ చోట పాతిపెట్టి పరారయ్యాడు. బిడ్డల కోసం వెతికిన తల్లికి పుట్టెడు శోకం మిగిలింది. భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి, పూజకు 2022లో వివాహమైంది. పూజ గర్భం దాల్చగా మే 30న హర్యానాలోని రోహ్‌తక్ ఆసుపత్రిలో కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. కవలలిద్దరూ ఆడ బిడ్డలు కావడం పట్ల నీరజ్, అతడి కుటుంబ సభ్యులు అంతృప్తి వ్యక్తం చేశారు. మగ పిల్లాడ్ని మాత్రమే కనాలంటూ పూజను పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు వేధించసాగారు. ఆడపిల్లలు.. అదీ కవలలు పుట్టారని తెలిసి కట్టుకున్న భర్తతోపాటు.. అత్తమామలు సూటిపోటి మాటలతో హింసించారు. ఈ క్రమంలో జూన్ 1న ఆసుపత్రి నుంచి పూజ, తప ఇద్దరు కవల పిల్లలు డిశ్చార్జ్ అవగా.. పూజ ఒక కారులో పుట్టింటికి బయలుదేరింది. భర్త నీరజ్ మరోకారులో కవల కూతుళ్లతో కలిసి ప్రయాణమయ్యాడు. తమ కారు వెనుకే నీరజ్ కారు వస్తున్నట్లు పూజ భావించింది. అయితే మార్గమధ్యలో కారు రూటు మార్చిన నీరజ్, కవల పిల్లలను ఎత్తుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభ్యం కాలేదు. పూజ, ఆమె సోదరుడు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదు. నీరజ్, కవల శిశివుల ఆచూకీ లేకపోవడంతో పూజ ఆందోళన చెందింది. నీరజ్ తన కవల కూతుళ్లను హత్య చేసి ఢిల్లీ శివారులోని పూత్ కలాన్‌లో పాతిపెట్టినట్లు పూజ సోదరుడికి తెలిసింది. దీంతో పూజ, అతడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2022లో నీరజ్‌ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అత్తమామలు తనను కట్నం కోసం వేధించేవారని, కొడుకు పుట్టాలని ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే తనకు కవల ఆడపిల్లలు పుట్టినందుకు భర్తతోపాటు అత్తమామలు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 5న ఇద్దరు శిశువుల మృతదేహాలను వెలికితీసి శవపరీక్షకు తరలించారు. పిల్లల మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నీరజ్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న నీరజ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.