
జనగామ, నవంబర్ 19: మూగజీవుల అవయవాలతో క్షుద్ర పూజలకు పాల్పడే దుండగులు అత్యంత దారుణానికి ఒడి గట్టారు. అమావాస్య ఘడియల వేల పాడి గోవును కట్టేసి ఒక కొమ్ము, కన్ను పీక్కు పోయారు. గో రక్తంతో గ్రామ శివారులోని ఉప్పలమ్మ గుడి వద్ద రక్తాభిషేకం చేశారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర భయాందోళన సృష్టిస్తుంది. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా చిలుకూరు మండలం శ్రీపతి పల్లి గ్రామంలో జరిగింది.
వెంకటేష్ అనే రైతు గోవులను పశువుల కొట్టంలో కట్టేశాడు.. మరుసటి రోజు పశువుల కొట్టం వద్దకు వెళ్లేసరికి ఆవు తీవ్ర రక్తస్రావంతో మృతి చెంది కనిపించింది. ఆవును పరిశీలించగా ఎడమవైపు కొమ్ము, ఎడమ కన్ను కత్తితో కోసి తీసుకువెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే రైతు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఆ పశువును తాళ్లతో బంధించి బలవంతంగా కత్తులతో దాడి చేసి కొమ్ము, కంటిని తొలగించుకు పోయినట్లు గుర్తించారు. వీటితోపాటు కొంత రక్తం కూడా వాళ్ళ వెంట తీసుకెళ్లారు.
Cow Killed In Jangaon District
ఒక కన్ను.. ఒక కొమ్ముతోపాటు కొంత రక్తాన్ని తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న ఉప్పలమ్మ గుడి ముందు పోశారు. పొలిమేర దేవతకు రక్తాభిషేకం నిర్వహించారు. దీంతో కచ్చితంగా గుర్తుతెలియని దుండగులు క్షుద్ర పూజల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అమావాస్యకు ముందు క్షుద్రపూజలు నిర్వహించే దుండగులు ఈ మూగజీవిని బలిచ్చి.. కొమ్ము, కన్నుతో ఏదైనా తాంత్రిక పూజలుచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అమావాస్యకు ముందు ఇంత దారుణం జరగడంతో ఊరంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. క్షుద్ర పూజల కోసమే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.