Medico Preethi: గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం.. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలు.. ఇవాళ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

ప్రీతి మరణించిందన్న ప్రకటన తర్వాత నిమ్స్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు.. మరోవైపు గిరిజన సంఘాలు.. ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు.. మూకుమ్మడిగా ముట్టడించడంతో నిమ్స్‌ పరిసరాలు అట్టుడికిపోయాయ్‌.

మెడికో ప్రీతి డెత్‌కి ముందు డెత్‌ తర్వాత భారీ హైడ్రామా నడిచింది. అసలా మాటకొస్తే వరంగల్‌ ఎంజీఎం నుంచి మొదలైన హైడ్రామా.. హైదరాబాద్‌ నిమ్స్‌కి ఫిష్ట్‌ చేసేవరకూ కొనసాగింది. హాస్పిటల్‌లో చేరిన క్షణం నుంచి మరణించేవరకూ ట్విస్టులు, లీకులతో పెద్ద కథే నడిచింది. అయితే, అసలైన డ్రామా ఆదివారం ఉదయం మొదలైంది. ఒకవైపు నిమ్స్‌ దగ్గర పోలీస్‌ బలగాలను మోహరిస్తుంటే, మరోవైపు ప్రీతి హెల్త్‌ కండీషన్‌పై లీకులు బయటికొచ్చాయ్‌. ఈలోపు నిమ్స్‌ నుంచి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కి ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. అంతలోనే మంత్రి ఎర్రబెల్లి నుంచి కీలక స్టేట్‌మెంట్‌ వచ్చింది. ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే మిగులుందన్న ఎర్రబెల్లి ప్రకటనతో నిమ్స్‌ దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ప్రీతి పరిస్థితి అత్యంత విషమం, బ్రెయిన్‌ డెడ్‌ అంటూ లీకులు హల్‌చల్‌ చేశాయ్‌. చివరికి రాత్రి 9గంటల 10నిమిషాలకు ప్రీతి చనిపోయినట్లు ప్రకటన విడుదల చేసింది నిమ్స్‌. బ్రెయిన్‌ డెడ్‌ కారణంగా మరణించినట్లు స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. ప్రీతి మరణించిందన్న ప్రకటన తర్వాత నిమ్స్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు.. మరోవైపు గిరిజన సంఘాలు..ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు.. మూకుమ్మడిగా ముట్టడించడంతో నిమ్స్‌ పరిసరాలు అట్టుడికిపోయాయ్‌. ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేవరకూ కదిలేది లేదంటూ ఆందోళనకు దిగారు. దాదాపు రెండు మూడు గంటలపాటు కొనసాగింది ఈ హైడ్రామా.

ప్రీతి డెడ్‌బాడీని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకోవడంతో నిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్‌. ఒకానొక టైమ్‌లో పరిస్థితి చేయిదాటిపోయింది. ఆందోళనకారులను కంట్రోల్‌ చేయలేక నానా తిప్పలు పడ్డారు పోలీసులు. చివరికి అందర్నీ అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా కూడా నిమ్స్‌ అండ్ గాంధీ హాస్పిటల్స్‌ దగ్గర పెద్దఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు. ప్రీతి మృతితో వరంగల్‌ KMC, MGM దగ్గర పోలీసులు భారీ భద్రతను పెంచారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు, ప్రీతి ఇన్సిడెంట్‌పై ఇవాళ విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చాయి గిరిజన విద్యార్ధి సంఘాలు, ఓయూ జేఏసీ. మరోవైపు ప్రీతి స్వగ్రామంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్థులు పోగై నిరసన తెలుపుతున్నారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంఎసీ ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..