Telangana Polls 2023: హైదరాబాద్‌కు బయట మజ్లీస్ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇవేనా..? ఏ పార్టీకి మేలు.. ఎవరికి నష్టం?
Telangana Election News: మజ్లీస్ పార్టీ.. కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన పార్టీ. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇప్పటికే విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.
Hyderabad: మజ్లీస్ పార్టీ.. కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన పార్టీ. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇప్పటికే విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా.. ముస్లీం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఇతర నియోజకవర్గాలపైనా ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. తమకు బలమున్న కనీసం 50 స్థానాల్లో ఎన్నికల బరిలో నిలుస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఈ లక్ష్యంతో ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముస్లీం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మజ్లీస్ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిస్తే ఏ పార్టీకి మేలు కలుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుందన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లోని 13 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీని ఓడించడం ఇతర పార్టీలకు అంత తేలికైన పనికాదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గాలు ఎంఐఎం అభ్యర్థుల విజయం నల్లేరు మీద బండినడకే. కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, అంబర్ పేట్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ తో పాటు మరికొన్ని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సదరు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. గత కొన్నేళ్ల నుంచే ఆ పార్టీ అక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై మజ్లీస్ నేతలు ఫోకస్ పెట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా.. గత 9 సంవత్సరాలుగా ముస్లింలపై సవతితల్లి ప్రేమి చూపించారని అసదుద్దీన్ ఇటీవల చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హీట్ పెంచాయి. అనేక ప్రాంతాలలో ముస్లింలపై చాలా దాడులు అవమానాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ముస్లింల అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్‌తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మొత్తానికి ముస్లీంల అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌తో ఇక కటీఫేనని అసద్ సంకేతాలిచ్చారు. అసద్ వ్యాఖ్యలతో ఏ పార్టీకి లబ్ధి చేకూర్చుతుంది.. ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది. మజ్లీస్ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ మజ్లీస్ పార్టీ చేతిలోనే ఉందని ఆయన ఆరోపించారు.
మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్‌పై టీవీ9 వివరణ కోరగా.. తాను బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు. కొన్నిచోట్ల ముస్లింలు అభివృద్ధికి నోచుకోవడం లేదని.. అందువల్లే తను అలా మాట్లాడాల్సి వచ్చిందని అసద్ చెప్పుకొచ్చారు. ముస్లీంల ప్రయోజనాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని ఆయన స్పష్టంచేశారు. ముస్లీంల అభివృద్ధి ఫోకస్‌గా పనిచేస్తామన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్టు తెలంగాణ వ్యాప్తంగా ముస్లీం ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లీస్ అభ్యర్థులు పోటీలో నిలిస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మతం సెంటిమెంట్ కారణంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని అభిప్రాయపడుతున్నారు.
(నూర్ మొహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్)
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..