- Telugu News Photo Gallery Spiritual photos Ancient Idols Found in Bodagutta, Allapalli Bhadrari Kothagudem
Telangana: గుట్టపై వెలిశామంటూ కలలో కనిపించిన సమ్మక్క సారలమ్మ దేవతలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Bhadrari Kothagudem News: మనదేశం పలు పుణ్య క్షేత్రాలకు ప్రసిద్ధి.. ఎన్నో రహస్యలను దాచుకున్న ఆలయాలు, పలు పుణ్యక్షేత్రాలను మన చుట్టూ చాలానే ఉన్నాయి. అయితే, తవ్వకాలు జరుపుతున్న సమయంలో తరచుగా ఎక్కడో ఒకచోట సనాతన ధర్మానికి చిహ్నంగా అనేక విగ్రహాలు, వస్తువులు లభ్యమవుతూనే ఉన్నాయి.
Updated on: Jun 01, 2023 | 1:41 PM

మనదేశం పలు పుణ్య క్షేత్రాలకు ప్రసిద్ధి.. ఎన్నో రహస్యలను దాచుకున్న ఆలయాలు, పలు పుణ్యక్షేత్రాలను మన చుట్టూ చాలానే ఉన్నాయి. అయితే, తవ్వకాలు జరుపుతున్న సమయంలో తరచుగా ఎక్కడో ఒకచోట సనాతన ధర్మానికి చిహ్నంగా అనేక విగ్రహాలు, వస్తువులు లభ్యమవుతూనే ఉన్నాయి. ఇవి అప్పటి రాజుల పాలనా వైభవానికి చిహ్నంగా సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తులుగా నిలుస్తుంటాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలం పాతూరు గ్రామ పరిధిలోని బోడగుట్టపై పలు పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో పలు విగ్రహాలు.. పురాతన వస్తువులు ఉన్నాయి. పురాతన శివలింగం, నల్ల రాతిపై చెక్కిన పెద్దపులి, పానపట్టం, బంగారపు పుస్తెలు, ముక్కు పుడకలు, రెండు కుంకుమ భరణలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని విగ్రహాలను చూసి.. అమ్మవారి మహిమ అని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

పాతూరు గ్రామానికి చెందిన ఈసం రవిబాబు అనే యువకుడికి వారం రోజుల నుంచి నిద్రలో సమ్మక్క సారలమ్మ దేవతలు కలలోకి వచ్చి గ్రామ సమీపంలోని బోడగుట్టపై వెలిచానని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని రవిబాబు గ్రామస్తులకు తెలిపాడు. అనంతరం గ్రామస్తులు బోడగుట్టపైకి వెళ్లి వెతకారు. ఈ క్రమంలో బండతో ఉన్న గుహను తెరిచి చూశారు.

గుహలో పురాతన శివలింగం, నల్లరాతి పై చెక్కిన పెద్దపులి పలక, పానపట్టం, బంగారపు పుస్తెలు, ముక్కుపుడక, రెండు కుంకుమ భరిణులు కనిపించాయి. దాంతో గ్రామస్తులు తండోపతండాలుగా గుట్ట వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామ పెద్దలు వసంతరావు కల్తీ నాగేశ్వరరావు కుల పెద్దలు కలిసి ఈనెల ఏడవ తారీఖున జాతర జరిపేందుకు నిర్ణయించుకున్నారు. అమ్మవారి మహిమతో ఇదంతా జరిగిందని అక్కడ ప్రజలు నమ్ముతూ పూజలు చేస్తున్నారు. అయితే, ఈ పురాతన విగ్రహాలు ఏ కాలం నాటివో ఇంకా గుర్తించాల్సి ఉంది. పురాతన విగ్రహాల గురించి అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు.





























