హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా ఫుట్ పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో వాహనదారులకు అడ్డగా ఉండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్యార్టర్స్ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తన వాహనం ఆపి దిగి స్వయంగా ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై ఉన్న కారును అక్కడి నుంచి పక్కకు జరిపారు.
ఈ లోగా మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న కారును దూరంగా తీసుకెళ్లి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దాదాపు పది నిమిషాల సేపు అక్కడే ఉన్న శ్రీధర్ బాబు ట్రాఫిక్ అవాంతరం తొలగిన తర్వాత బయలు దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.