Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..

రేషన్ కార్డు దారులకు పండుగ ముందే వచ్చేసింది.. సీఎం రేవంత్ సర్కార్ ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ఈ పధకాన్ని హుజూర్ నగర్ లో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. దీనిపై పూర్తి వివరాలు ఇలా..

Hyderabad: రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
Ration Shop
Follow us
M Revan Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Mar 24, 2025 | 9:45 AM

రేషన్ కార్డుల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అర్హులైన రేషన్ కార్డుదారుల ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. దొడ్డుబియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వనుంది సర్కార్. పేదలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు సీఎం రేవంత్ వస్తున్నారు.

రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.

రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఈ పథకం ద్వారా పంపిణీ అయ్యే నాణ్యమైన సన్నబియాన్ని లబ్ధిదారులు పూర్తిగా వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రజా పంపిణీ అందించిన దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినలేకపోయారని, ఆ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, రీసైక్లింగ్ జరుగుతుండేది. సన్నబియ్యం ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తమ ప్రభుత్వం ఆహార భద్రతలో భాగంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని అమలు చేయనుందని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. హుజూర్ నగర్‌లో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.