AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇబ్రహీంపట్నం ఘటన బాధ్యులపై తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు.. డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

ఇబ్రహీంపట్నం ఘటన బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.

Telangana: ఇబ్రహీంపట్నం ఘటన బాధ్యులపై తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు.. డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు..
Ibrahimpatnam Incident
Ravi Kiran
|

Updated on: Sep 24, 2022 | 10:01 AM

Share

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అంతే కాకుండా. రంగారెడ్డి DMHO స్వరాజ్య లక్ష్మి, DCHS ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు పడింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.

బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆపరేషన్ తర్వాత పేషెంట్‌ను 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలి. ఇంటకి వెళ్లిన తర్వాత పేషెంట్ పరిస్థితి తెలుసుకోవాలని సూచించింది. ఒక ఆస్పత్రిలో రోజుకు 30కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీల్లేదు. అలాగే ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణపై సమీక్ష జరపాలని ఆదేశించింది వైద్యారోగ్య శాఖ.

మార్గదర్శకాలు ఇవే..

  • ఆసుపత్రుల సేవల్లో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి.
  • కు.ని ఆపరేషన్లు నిర్ణయించిన రోజులో మాత్రమే చేయాలి. ఆపరేషన్ తర్వాత 24 గంటల పాటు విధిగా అబ్జర్వేషన్‌లో ఉంచాలి.
  • ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం, ఆపరేషన్ చేసుకునేవారు, వారికి ఇష్టం ఉన్న రోజులో రావొచ్చు.
  • డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన పేషెంట్‌ని సంబంధిత ఆసుపత్రి సూపర్‌వైజర్ 24గంటల్లోగా ఒకసారి, వారంలోగా మరో రెండుసార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.
  • సంబంధిత పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలోని ఆపరేషన్ చేసుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి.
  • పేషెంట్ సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా లేదా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి.
  • ప్రి ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్, DPL క్యాంపు ఆఫీసర్ చూసుకోవాలి.
  • ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తుపట్టే విధంగా సూపర్ వైజర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి.
  • ఏడాదికి ఒకసారి డీపీల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • కమిషనర్ ఆఫీసులోని రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్ మీద కు.ని నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరుపాలి.
  • నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయరాదు.
  • ఆయా ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలి.
  • బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రుల్లోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, నర్సులకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో శిక్షణ ఇవ్వాలి.
  • ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు పాటించే విధంగా DME, TVVP కమిషనర్ చూసుకోవాలి, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో ప్రత్యేక దృష్టి సారించాలి.

అసలేం జరిగిందంటే..

ఆగస్ట్ 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మహిళలకు కుటుంబ నియత్రణ నియంత్రణ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆపరేషన్ వికటించి.. మమత, సుష్మ, మౌనిక, లావణ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుల బంధువులు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణకు ఆదేశిస్తూ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మహిళలకు ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించింది. సర్జరీ టైమ్‌లో వాడే పరికరాలన్నీ పూర్తిగా స్టెరిలైజ్ చేసి ఉండాలనే ప్రాథమిక విషయాన్ని ఎలా మర్చిపోయారు.. అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించింది విచారణ కమిటీ.

సాధారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి మరో వారం పది రోజులపాటు వైద్య సేవలు అవసరం. స్థానికంగా ఉండే ANMలు, ఆరోగ్య కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి సర్జరీ జరిగిన చోట డ్రస్సింగ్ చేయాలి. కానీ ఇక్కడలా జరగలేదని తెలుస్తోంది. ఆపరేషన్ చేసిన చోట చీము పట్టడం మరికొందరిలో ఇన్ఫెక్షన్‌కి కారణమైంది. వీటన్నిటిపైనా విచారించిన దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా 13 మందిపై యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం.

మరిన్ని హైదరాబాద్ వార్తలు కోసం..