KCR POLITICAL FIGHT: కేంద్రంపై పోరాటం.. బీజేపీతో యుద్ధం.. రెండంశాలపై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వంపైనా, భారతీయ జనతా పార్టీ (BJP) విధానాలపైనా నిప్పులు చెరిగారు.
KCR LAUNCHES POLITICAL FIGHT AGAINST NARENDRA MODI’S CENTRAL GOVERNMENT: కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వంపైనా, భారతీయ జనతా పార్టీ (BJP) విధానాలపైనా నిప్పులు చెరిగారు. కేంద్రంపై ఇక తగ్గేదేలే అంటూ పోరాటపర్వాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరాంతంలో వినియోగించి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టిన ధాన్యం సేకరణ అంశాన్నే ఈ పోరాటానికి తొలి అస్త్రంగా చేసుకుంటున్నారు గులాబీ బాస్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఉద్యమించి, కేంద్రం దిగివచ్చేలా చేసిన పంజాబ్ రైతుల పోరాట స్పూర్తినే మార్గంగా కేసీఆర్ ఎంచుకున్నారు. మార్చి 24, 25 తేదీలలో కేంద్రంపై ఉద్యమానికి శ్రీకారం చుడతామని కూడా ముహూర్తాన్ని వెల్లడించేశారు. ధాన్య సేకరణ విధానాన్ని తొలుత ఎండగట్టిన కేసీఆర్.. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికో విధానం ఏంటని ప్రశ్నించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయంటూనే తెలంగాణలో గిరిజన జనాభా శాతానికి అనుగుణంగా వారి రిజర్వేషన్లను పెంచుకుంటామంటే కేంద్రం అనుమతివ్వడం లేదని నిందారోపణ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి.
అయితే.. పోరాటాంశాలు ఎలా వున్నా.. కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని అంచనా వేయడం ప్రారంభించారు. ముందస్తుగా ఎన్నికలకు వెళుతున్నారా అంటూ మీడియా అడిగితే ఆ కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు అపర ఛాణక్యునిగా పేరుగాంచిన కేసీఆర్. అంటే ముందస్తు వ్యూహాలు తన వద్ద వున్నాయా ? వుంటే ముందస్తు లేదని ఆయనెందుకు చెప్పారు? ఇలాంటి ప్రశ్నలకు ఒకటే సమాధానం.. ప్రధాన పోటీదారుగా భావిస్తున్న బీజేపీపై యుద్దం ప్రకటించడం ద్వారా కమలనాథులు ఎన్నికలకు సంసిద్ధం కాకుండా టీఆర్ఎస్ విమర్శలకు, ఆరోపణలకు సమాధానాలిచ్చుకునే పనిలోనే ఎంగేజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ శ్రేణులతో ఇటీవల కీలక భేటీలు నిర్వహించారు గులాబీ దళపతి. శనివారం (మార్చి 19న) ఉన్నట్లుండి ఎర్రవెళ్ళిలోని తన ఫామ్ హౌజ్‌కు పార్టీ సీనియర్లను, అందుబాటులో వున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను రప్పించుకున్నారు. సోమవారం (మార్చి 21న) పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక భేటీ నిర్వహణకు సంబంధించిన సమాచారమందించారు. భేటీ ఎజెండాపై వారితో చర్చించినా.. దాన్ని మీడియాకు తెలియకుండా గోప్యత పాటించారు.
అనుకున్నట్లుగానే మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేతల భేటీ జరిగింది. అనంతరం మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్.. ధాన్యం సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. తెలంగాణలో పండిన ప్రతీ గింజను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందాలను న్యూఢిల్లీకి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ బృందాలు తొలుత కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిని కల్వబోతున్నాయి. ఆయన స్పందన ఆధారంగా దీర్ఘ కాలిక ఉద్యమానికి వ్యూహరచన చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ రంగానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒకే విధానం వుండాలని ఆయనంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను కొంటున్న కేంద్రం తెలంగాణ వంటి రాష్ట్రాల విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ధాన్యానికి కనీస మద్దతు ధర ఇస్తున్నప్పుడు రా రైస్, బాయిల్డ్ రైస్ అనే అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ సునిశిత ప్రశ్నలు సంధించారు.
ధాన్యం సేకరణ, గిరిజన రిజర్వేషన్లతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను తాను అస్త్రాలుగా మలచుకోబోతున్నట్లు కేసీఆర్ సంకేతాల్నిచ్చారు. గతంలో 8 శాతం దాటిని దేశ జీడీపీ.. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్య విధానాల కారణంగా పడిపోతుందని ఆరోపించారు. 8 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టునైనా కొత్తగా నిర్మించలేదంటూ తన హయాంలో తెలంగాణలో నిర్మాణం పూర్తి చేసిన కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును పరోక్షంగా ప్రస్తావించారాయన. మోదీ హయాంలో దేశ అభివృద్ధి తిరోగమనంలో వుందంటూనే దేశప్రజల్లో మరోసారి జాతీయతా భావాన్ని పెంచుతున్న కశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా ప్రస్తావించారు. దేశానికి కశ్మీర్ ఫైల్స్ అవసరం లేదని.. ఇరిగేషన్ ఫైల్స్ కావాలని, ఎకానమిక్ ఫైల్స్ కావాలని కేంద్రానికి హితవు పలికారు. ధాన్యం సేకరణ అంశాన్ని జాతీయ అంశంగా చేసే ప్రణాళికను పరోక్షంగా చెప్పారయన.
తెలంగాణలో ఈసారి యాసంగి (రబీ సీజన్)లో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుందని, 3 లక్షల ఎకరాలు విత్తనాల కోసం రైతులు వాడుకుంటారని, మరో 2 లక్షల ఎకరాలు సొంత అవసరాలకు వాడుకుంటారని.. మిగతా ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని కేసీఆర్ గణాంకాలు కూడా వెల్లడించారు. ఆహార ధాన్య సేకరణ విషయంలో దేశమంతా ఒకే దేశం- ఒకే సేకరణ విధానం ఉండాలన్నారు. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు పెట్టిందని, యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా ఉంటే ఓకే లేకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని తీర్మానించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పత్రికా ప్రకటనలు, మాటలతో ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందని, పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని, తెలంగాణ ఉద్యమ స్థాయిలో తమ పోరాటం వుంటుందని చెప్పారు. అయితే.. కేవలం ధాన్యం సేకరణ అంశమే కాకుండా జాతీయ స్థాయిలో రైతుకు రాజ్యాంగ రక్షణను డిమాండ్ చేయడం ద్వారా మరిన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రైతాంగానికి రాజ్యాంగ రక్షణ లభించేలా కొత్త చట్టాలను తీసుకొస్తే పార్లమెంటులో కేంద్రానికి సహకరిస్తామని కూడా కేసీఆర్ వ్యూహాత్మక ప్రకటన చేయడం విశేషం.
కేంద్రంపైనా.. మరీ ముఖ్యంగా బీజేపీపైనా కేసీఆర్ నిప్పులు చెరగడం వెనుక పెద్ద వ్యూహమే వుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్రస్తుతానికి ముందస్తు లేదన్న సంకేతాలిచ్చినా కేసీఆర్ వ్యూహాలు ఆ దిశగానే సాగుతున్న సంకేతాలున్నాయంటున్నారు. అయితే.. ముందస్తు లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని చెప్పకనే చెప్పారు. బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘ కాల ఉద్యమానికి తెరలేపడం ద్వారా బీజేపీని నిరోధించే వ్యూహమే ప్రస్ఫుటమవుతోందంటున్నారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీకి 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగాలి. అంటే ఇంకా 18, 19 నెలల సమయం వుంది. కానీ.. పొలిటికల్ హీట్ పెంచేలా పోరాట కార్యాచరణను ఖరారు చేసిన కేసీఆర్.. తమ ప్రత్యర్థి బీజేపీయేనని చాటారు. అంటే వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలమంతా బీజేపీని వీక్ చేసేలా వ్యూహాలను అమలు చేయబోతున్న సంకేతాల్నిచ్చారు. బీజేపీ విస్తరణ వ్యూహాలకు చెక్ పెట్టేలా కౌంటర్ వ్యూహం అమలు పరచబోతున్నారు. ఓవైపు ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంటూ గ్రౌండ్ లెవెల్ సర్వేలను తెప్పించుకుంటున్న కేసీఆర్.. బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థిగా మారే సంకేతాలను గ్రహించడం వల్లనే పోరాట పంథాను కమలం పార్టీవైపు మరల్చారని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే నిర్వహించామని, అందులో 29 సీట్లు టీఆర్ఎస్ పార్టీవేనని తేలినట్లు చెప్పిన గులాబీ దళపతి.. ఇదంతా వచ్చే ఎన్నికలకు సమాయత్తమవడంలో భాగమేనని చెప్పకనే చెప్పారు. ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా లేక షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అన్నది పక్కన పెడితే.. రెండంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు భావించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకటి.. బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని.. రెండు.. వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించామని.. కేసీఆర్ పరోక్షంగా తేల్చేశారు. ఇక తేలాల్సింది.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అన్నది మాత్రమే.