Vande Bharat Express: ఇకపై 7 గంటల్లోనే.. సికింద్రాబాద్ టూ బెంగళూరు వందేభారత్ రూట్ ఖరారు.!!
సికింద్రాబాద్ టూ బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్‌ను..
మరికొద్ది రోజుల్లోనే సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ టూ బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సుమారు ఏడు రైలు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 11 గంటలుగా ఉంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆ ప్రయాణాన్ని ఏడు గంటలకు తగ్గించేలా రైల్వే అధికారులు షెడ్యూల్ సిద్దం చేశారట.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా.. మరొకటి మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా ఉంది. ప్రస్తుతమైతే కాచిగూడ-బెంగళూరు మీదుగానే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. ట్రాక్ సామర్ధ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలును వచ్చే నెల 21న ప్రారంభించే అవకాశం ఉందట. అటు టైమింగ్స్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అందులో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, ఇంకొటి సికింద్రాబాద్-తిరుపతి.. ఈ రెండు రూట్లలోనూ ట్రైన్ల ఆక్యుపెన్సీ అమోఘంగా ఉందని అధికారులు చెప్పారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు కూడా కోచ్‌లను పెంచారు.