AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Nimajjanam: 22 క్రేన్లు..12 వేల మంది పోలీసులు.. 33 చెరువులు.. భాగ్యనగరంలో శోభాయాత్రకు సర్వం సిద్ధం..

నగరం ముస్తాబయ్యింది. శోభాయాత్రకు సర్వం సిద్ధమయ్యింది. నిమజ్జనానికి అంతా రెడీ అయింది. లోటుపాట్లకు తావులేకుండా పక్కా ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం.

Ganesh Nimajjanam: 22 క్రేన్లు..12 వేల మంది పోలీసులు.. 33 చెరువులు.. భాగ్యనగరంలో శోభాయాత్రకు సర్వం సిద్ధం..
Ganesh Nimajjanam
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2022 | 10:02 PM

Share

భాగ్యనగరంలో శుక్రవారం జరగబోయే నిమజ్జన మహోత్సవానికి(Ganesh Nimajjanam) సర్వం సిద్ధమైంది. 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనులు ఏర్పాటయ్యాయి. 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచారు. 168 జీహెచ్‌ఎంసీ గణేశ్ యాక్షన్ టీమ్స్‌ రెడీ కాగా.. విధుల్లో 10 వేల మంది శానిటేషన్ కార్మికులు పాల్గొననున్నారు. 74 ప్రాంతాల్లో బేబి పాండ్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాతబస్తీలో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. బాలాపూర్‌ గణేశ్‌ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఎలక్ట్రిక్ సిటీ, GHMC డిపార్ట్‌మెంట్ రూట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్, సిమెంట్ బారికేడ్లను తొలగించారు.

ఓల్డ్‌సిటీ సహా హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పహారా మొదలైంది. ట్యాంక్‌బండ్‌కి కనెక్ట్ అయ్యే అన్ని రూట్లలోనూ, కీలక మసీదు సెంటర్లలోనూ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇదే సమయంలో హైదరాబాదీ ముస్లింలకు మతపెద్దలు పిలుపునిచ్చారు. గంగాజమునా తెహజీబ్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో శాంతి, ప్రశాంతతకే పెద్దపీటన్నారు మతపెద్ద కుబూల్‌ పాషా షిత్తారీ. శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడికక్కడ స్థానిక మసీదుల్లోనే చేసుకోవాలని సూచించారు.

మరోవైపు.. బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగేలా వినాయకుడు ఆశీర్వదించేలా చూడాలని కోరుకున్నట్టు చెప్పారు.

ఇక.. భైంసా ఖాకీవనంగా మారింది. పట్టణం బందోబస్తుతో నిండిపోయింది. పోలీసు పహారాతో పరిసరాలన్నీ నివురుగప్పిన నిప్పులా మారాయి. భైంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు పోలీసులు. శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 400 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 2 డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 85 మందిని బైండోవర్ చేశారు. ఎస్పీతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 350 మంది పోలీసు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం