Nagini dance with python: పాము అంటేనే భయపడి ఆమడదూరం పారిపోతారు. ప్రమాదకరమైన కొండచిలువను మెడలో వేసుకుని నాగిని డ్యాన్స్ చేస్తే.. సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.. బోనాల వేడుకల్లో పోతరాజు వేషం వేసిన ఓ వ్యక్తి కొండ చిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేసి.. చివరకు కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో జరిగిన బోనాల వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. బోనాల పండుగలో భాగంగా కళాకారులు డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ..ఓ కళాకారుడు పేద్ద కొండ చిలువ పామును బుట్టలోంచి బయటకు తీశాడు. ఏకంగా కొండచిలువను తన మెడలో వేసుకున్న ఆ కళాకారుడు పామును అటు ఇటు తిప్పుతూ నాగిని నృత్యం చేశాడు.
ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటనతో అక్కడున్న వారు దెబ్బకు షాకయ్యారు. గుండెల్లో దడపుట్టి ఒక్కసారిగా ఆమడదూరం జరిగారు. మరికొందరు యువకులు మాత్రం చుట్టూ చేరి తెగ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియోలో ఈ వీడియో తెగ వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కొండ చిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేస్తున్న కళాకారుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కినెట్టారు.
పాముతో నృత్యం చేయడం.. పామును హింసించడం నేరం.. కావున జంతు హింస నేరం కావడంతో.. యానిమల్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పాముతో బహిరంగంగా నృత్యాలు చేయడం ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి అని స్థానికులు చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..