రానున్న ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎంఈ ఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని జాతీయ రహదారులు, విద్యా సంస్థలు, ప్రార్ధనా మందిరాలు, ఆసుపత్రులు , ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటుతామని ఆమె తెలిపారు. మానవ జీవితంలో అంతర్భాగమైన ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని . ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్ర అత్యంత ముఖ్యమైందని సుధా రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ఫౌండేషన్, సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి మొక్కలు నాటటం వేగవంతం చేస్తామని తెలిపారు. తొలి ఏడాది దేశ వ్యాపితంగా వెయ్యి కి లోమీటర్ల పరిధిలో పది లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు. ఐదు సంవత్సరాల్లోకోటి మొక్కలను నాటుతామని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందిచటం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా విడుదలైన ఒక నివేదికలో కాలుష్యంలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉందని, ఇది ఆందోళన కరమైన విషయం అని సుధారెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు భాగస్వాములై అనతికాలంలోనే కాలుష్య రహిత దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో మొక్కలు పెంచాలని, ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు గృహాలు, నివాస సముదాయాలు నిర్మించే ప్రతి ఒక్కరు కొంత స్థలాన్ని మొక్కలు పెంపకానికి తప్పని సరిగా విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు విరివిగా పెంచటం వల్ల వాతావరణ సమతుల్యత ఏర్పడి వర్షాలు కురుస్తాయని, దీనివల్ల పంటలు బాగా పండి ఆహార ధాన్యాల కొరత ఉండదని, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని అన్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు తమ ఫౌండషన్స్ ఎపుడూ ముందుంటాయని సుధారెడ్డి చెప్పారు.