KTR: తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం.. అధికారంలోకి వచ్చాక అన్ని పేర్లు మారుస్తాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

|

Aug 19, 2024 | 3:47 PM

తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది.

KTR: తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం.. అధికారంలోకి వచ్చాక అన్ని పేర్లు మారుస్తాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR
Follow us on

తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. అలాంటి చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడమంటే ఆత్మగౌరవం మీద దాడిచేసినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉందని విగ్రహం పెడుతున్నారంటూ ప్రశ్నించారు. వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మనసు మార్చుకుని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి.. తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. సకల మర్యాదలతో రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడి నుంచి తరలిస్తామని తెలిపారు.

అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమని.. ఇప్పుడు విగ్రహం పెట్టినా అధికారంలో వచ్చాక దానిని వెంటనే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. అంతే కాకుండా తెలంగాణలో రాజీవ్ పేరుతో ఉన్న రింగ్ రోడ్డు, హైదరాబాద్ విమానాశ్రయం సహా ఇతర సంస్థల పేర్లూ మారుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇందిరా, రాజీవ్‌ పేర్లతో హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయని.. కాంగ్రెస్‌ ఇప్పటికైనా మారకుంటే అధికారంలోకి వచ్చాక అన్ని పేర్లు మారుస్తామని పేర్కొన్నారు.

కాగా.. తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ ఘనంగా జరిగింది.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు రాఖీ కట్టారు.. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..