AIMIM: ఎంపీ, ఎమ్మెల్యే.. ఎవరైనా పార్టీ ఆఫీస్‌కు రావాల్సిందే.. రిజిస్టర్‌లో సంతకం పెట్టాల్సిందే..

|

Jun 05, 2023 | 7:56 PM

AIMIM party office: పేరుకు అది ఒక పార్టీ ఆఫీసు.. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయంలా ఉంటుంది. అంతా క్రమశిక్షణగా ఉంటారు.. టైమ్‌కి రావడం, రిజిస్ట్రర్‌లో సంతకం జరుగుతుంటుంది. కానీ నిజానికి వాళ్లు అధికారులు కాదు. నిత్యం జనాల్లో ఉండే రాజకీయ నేతలు.

AIMIM: ఎంపీ, ఎమ్మెల్యే.. ఎవరైనా పార్టీ ఆఫీస్‌కు రావాల్సిందే.. రిజిస్టర్‌లో సంతకం పెట్టాల్సిందే..
Aimim
Follow us on

AIMIM party office: పేరుకు అది ఒక పార్టీ ఆఫీసు.. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయంలా ఉంటుంది. అంతా క్రమశిక్షణగా ఉంటారు.. టైమ్‌కి రావడం, రిజిస్ట్రర్‌లో సంతకం జరుగుతుంటుంది. కానీ నిజానికి వాళ్లు అధికారులు కాదు. నిత్యం జనాల్లో ఉండే రాజకీయ నేతలు. మామూలుగా అయితే పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల హడావుడి తప్ప నాయకుల సందడి కనిపించదు. అది కూడా ఏదైనా సందర్భం ఉంటేనే జరుగుతుంది. కేవలం పార్టీ పెద్ద ఆ కార్యాలయానికి వస్తేనే మిగతా నేతలంతా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత అంతా షరామామూలే. మామూలు జనం పార్టీ ఆఫీసుల గడప కూడా తొక్కరు. ఏదైనా బహిరంగ సమావేశానికో లేక ప్రారంభోత్సవానికో ఆయా నేత వచ్చినప్పుడు కలిసి అర్జీలు ఇస్తుంటారు. ఇక కొందరు నేతలైతే అసెంబ్లీకి కూడా చుట్టం చూపుగా వెళ్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటిది ఓ పార్టీ కేంద్ర కార్యాలయానికి మాత్రం ఎంపీల స్థాయి నుంచి వార్డు మెంబర్‌ స్థాయి వరకు నేతలంతా రోజూ ఉద్యోగుల్లా వెళ్తుంటారు. అదే ఆలిండియా మజ్లిస్‌ ఇతిహాదుల్‌ ముస్లిమిన్‌ పార్టీ.. సులువుగా చెప్పాలంటే ఎంఐఎం పార్టీ.

ప్రతీరోజూ ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల మధ్యలో నేతలంతా ఆఫీసుకు చేరుకోవాలి. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో వెళ్లిపోవచ్చు. శుక్రవారం మినహా మిగతా రోజులన్నీ వాళ్లకు వర్కింగ్‌ డేనే. ఈ నాయకులను ఇంటి దగ్గర కార్యకర్తలు ఎవరూ కలవరు. అదీ అత్యంత అవసరమైతేనే కలుస్తారు. ఎవరైనా సరే వాళ్లను కలవాలంటే కార్యాలయానికి రావాల్సిందే. దేశవ్యాప్తంగా హిందువులకు ఎంఐఎం పార్టీ వ్యతిరేకం అనే ముద్ర బలంగా పడింది. వాస్తవానికి ముస్లిం ప్రాంతాల్లో హిందూ దేవాలయాల అభివృద్ధికి ఎంఐఎం ఎంతో సహకరించింది. లాల్‌దర్వాజా అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి అక్బరుద్దీన్‌ ఓవైసీ నిధులు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా హిందువుల సమస్యలను పరిష్కరించడంలో కూడా అక్కడి నేతలు ముందుంటారు. పార్టీ ఆఫీసు దారుసలాంకు హిందువులు కూడా ఫిర్యాదులు, దరఖాస్తులు చేసేందుకు వస్తుంటారు. చిన్నారులు సైతం వచ్చి నేరుగా ఎంపీని కూడా కలిసే అవకాశం ఉంటుంది. వీరి కార్యాలయాల్లో ఎలాంటి లాబీయింగ్‌లు పనిచేయవు. వచ్చినవారు సమస్య చెప్పి వెళ్లిపోవాల్సిందే మిగతాది వాళ్లుచూసుకుంటారు.

ఇక్కడ ఎంపీని కూడా సాధారణ జనం నేరుగా కలవడానికి వీలుంటుంది. పార్టీ కార్యాలయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎవరిని చెకింగ్‌ కూడా చేయరు, సమస్యతో వస్తే నేరుగా లోనికి పంపిస్తారు. అంతేకాకుండా ఎవరు ఏ ఫంక్షన్‌కి పిలిచినా నేతలు నిర్మొహమాటంగా వస్తారు. వారి నియోజకవర్గ పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్‌, పోలీసుల కంటే ముందు నేతలు అక్కడికి చేరుకుంటారు. తక్షణమే సాయం కూడా అందిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి పీఆర్వోలు, పీఏలు ఉండరు. ఏ పనిఉన్నా వారే నేరుగా ఫోన్లలో మాట్లాడుతారు. నేతలు ఉదయం సమయాల్లో నియోజకవర్గాల్లో ప్రతిరోజూ తిరుగుతూ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారని ప్రజలు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో కార్యకర్తలు, ప్రజలను కలవడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. 24 గంటలు నిత్యం అందుబాటులో ఉండటం వల్లే ఎంఐఎం నేతలు వారి ప్రాంతాల్లో ప్రజలతో మమేకమైపోయారు.

ఇవి కూడా చదవండి

-నూర్ మహమ్మద్ టీవీ9 ప్రతినిధి హైదరాబాద్

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం..