Jubilee Hills By Election: ఇజ్జత్‌కా సవాల్‌.. రంగంలోకి బ్రాండ్‌ అంబాసిడర్లు..! జూబ్లీహిల్స్‌లో ఇక దుమ్ముదుమారమే..

ఇజ్జత్‌కా సవాల్‌.. అందుకే పార్టీలూ అంతలా శివాల్. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుందన్నట్లుంది పార్టీల పంతం చూస్తుంటే. సిట్టింగ్‌ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్‌ఎస్‌. రెండేళ్ల పాలనతో కాంగ్రెస్‌కి ఈ ఉప ఎన్నిక ఓ విధంగా రెఫరెండమే. ఇక అర్బన్‌లో బలపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అది బోనస్సే.

Jubilee Hills By Election: ఇజ్జత్‌కా సవాల్‌.. రంగంలోకి బ్రాండ్‌ అంబాసిడర్లు..! జూబ్లీహిల్స్‌లో ఇక దుమ్ముదుమారమే..
Jubilee Hills By Elcetion

Updated on: Oct 30, 2025 | 8:37 AM

ఇజ్జత్‌కా సవాల్‌.. అందుకే పార్టీలూ అంతలా శివాల్. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుందన్నట్లుంది పార్టీల పంతం చూస్తుంటే. సిట్టింగ్‌ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్‌ఎస్‌. రెండేళ్ల పాలనతో కాంగ్రెస్‌కి ఈ ఉప ఎన్నిక ఓ విధంగా రెఫరెండమే. ఇక అర్బన్‌లో బలపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అది బోనస్సే. కాంగ్రెస్‌ ఖల్లాస్‌ అని బీఆర్‌ఎస్‌ అంటుంటే.. అధికారపార్టీకి ఓటమి భయం పట్టుకుందంటోంది బీజేపీ. గన్‌షాట్‌గా గెలుపు మాదేనంటోంది కాంగ్రెస్‌. దీంతో బస్తీమే సవాల్‌ అన్నట్లే ఉంది జూబ్లీహిల్స్‌ బైపోల్‌..

ఒక్క నియోజకవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తోంది. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. బ్రాండ్‌ అంబాసిడర్లు దిగిపోతున్నారు. అన్ని పార్టీల నేతలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికను చావోరేవో అన్నట్లే తీసుకున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు..

ఓట్‌ ప్లీజ్‌ అంటూ జూబ్లీహిల్స్‌లో ప్రతీ ఇంటి తలుపు తడుతున్నాయి ప్రధానపార్టీలు. బస్తీలు, వార్డులను చుట్టేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడుపార్టీలూ సవాలుగా తీసుకున్నాయి. సిట్టింగ్‌ సీటు కావటంతో సెంటిమెంట్‌తో కొడుతోంది బీఆర్‌ఎస్‌. గోపీనాథ్‌ సతీమణి సునీతకు టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌కి ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరిగిన కంటోన్మెంట్‌ బైపోల్‌లో.. సిట్టింగ్ సీటుని దక్కించుకోలేకపోయింది బీఆర్‌ఎస్‌. అందుకే జూబ్లీహిల్స్‌ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఎంఐఎం ఈసారి కాంగ్రెస్‌వైపు ఉండటంతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీపార్టీ. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు. అక్టోబర్ 31నుంచి నవంబర్ 9వరకు రోడ్‌షోలు ప్లాన్‌ చేసుకున్నారు కేటీఆర్‌.

బీసీ అభ్యర్థిని బరిలోకి దించిన అధికారపార్టీ జూబ్లీహిల్స్‌లో విజయం తథ్యమంటోంది. ఎంఐఎం మద్దతుకు తోడు, అజార్‌కి మంత్రి పదవి ఇస్తున్నామనే సంకేతాలతో కీలకమైన మైనారిటీ ఓట్లపై గట్టిగానే గురిపెట్టింది కాంగ్రెస్‌. వ్యూహాత్మకంగా సినీ కార్మికులతో కూడా సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రులు, ముఖ్యనేతలు జూబ్లీహిల్స్‌ని చుట్టేస్తున్నారు. కంటోన్మెంట్‌ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. ఆ ధీమాతోనే బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీకి సవాల్‌ విసురుతోంది.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌లో సమీకరణాలు కలిసొస్తే తమకు బోనస్సేననుకుంటోంది బీజేపీ. కమలంపార్టీ ముఖ్యనేతలంతా జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని, రెండేళ్లలో కాంగ్రెస్‌ హామీలు నిలబెట్టుకోలేకపోయిందని ప్రజల్లోకెళ్తున్నారు. కాంగ్రెస్‌ మైనారిటీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంటే..దానికి రివర్స్‌ స్ట్రాటజీలో వెళ్తున్నారు కమలంపార్టీ నేతలు.

నవంబరు 11న జరగబోతోంది జూబ్లీహిల్స్‌ బైపోల్‌. 58మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. మూడుపార్టీల మధ్యే గట్టి పోటీ నడుస్తోంది. గ్రేటర్‌ సిటీకి గుండెకాయలాంటి నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి ప్రధానపార్టీలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..