హైదరాబాద్, నవంబర్ 12: ప్రేమించిన వాడు నిర్లక్ష్యం చేయడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
జమ్ము- కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్ నబీ దార్ (23) అనే యువతి హైదరాబాద్ షేక్‌పేటలోని ఓ ఇంట్లో అద్దెకుంటోంది. ఆమె ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్షన్‌నగర్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో శాంపిల్ ఎగ్జిక్యూషన్ అనలిస్ట్‌గా పనిచేస్తుంది. నవంబర్ 7న ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ ఫోన్ చేయగా.. ఆమె ఎంతకు లిఫ్ట్ చేయలేదు. బ్యాంకుకు కూడా వెళ్లలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇరామ్ ఫ్లాట్‌కు చేరుకుని, తలుపు కొట్టి చూశారు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించింది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, గత కొంత కాలంగా వీరిద్దరూ గొడవపడుతున్నట్లు.. ఫలితంగా ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అబ్దుల్ అనే యువకుడితో ఇరామ్‌నబీ దార్ ప్రేమలో ఉంది. రోజూ బ్యాంకు నుంచి వచ్చిన తర్వాత ఆమె అతనితో మాట్లాడేది. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆత్మహత్యకు ముందు రోజు కూడా ఇరామ్ నబీ దార్ రాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని తన ప్రియుడితో మాట్లాడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఇరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.