AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ట్రాఫిక్ కష్టాలకు చెక్!

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అంతకంతకు జనాభా సైతం పెరుగుతోంది. దీనితోడు వాహనాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి.

Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ట్రాఫిక్ కష్టాలకు చెక్!
Hyderabad Traffic
Balaraju Goud
| Edited By: Ravi Kiran|

Updated on: May 04, 2022 | 5:19 PM

Share

Hyderabad Traffic: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అంతకంతకు జనాభా సైతం పెరుగుతోంది. దీనితోడు వాహనాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో రోజురోజుకు ట్రాఫిక్ మరింతగా పెరిగిపోతోంది. మెయిన్ రోడ్డు మొదలుకొని అన్ని దారుల్లో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. ఇలా భారీ ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఊరటనిచ్చేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే జంట నగరాలయిన హైదరాబాద్, సికింద్రాబాద్ ట్రాఫిక్ విషయంలో భారీ మార్పులకు రంగం సిద్ధమయ్యింది.

అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో వాహనాల రాకపోకల నియంత్రణలో విజయం సాధిస్తున్న హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. మరో వినూత్న పద్దతిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్‌ జాంల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గూగుల్‌ సంస్థ భాగస్వామ్యంతో ట్రాఫిక్‌ జాంకు సంబంధించిన పూర్తి వివరాలను వాహనదారుకు అందించేందుకు ఫ్లాన్ చేశారు. ఇందుకు పోలీసులకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, వీవీఐపీల రాకపోకలు, ర్యాలీలు, ధర్నాలు కారణంగా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్‌ జాంల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు సమాచారం అందేవిధంగా గూగుల్‌ మ్యాప్‌లో అప్‌డేట్‌ చేయనున్నారు.

ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా ఆప్‌డేట్ చేయనున్నారు. ఈ యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారమవడంతోపాటు క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాల్లో నగరానికి వచ్చే పర్యాటకులు, వాహనదారులు, డెలివరీబాయ్‌లతో సహా రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రయోగాత్మకంగా యాప్‌ను పనితీరును పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

న్యూయార్క్‌ నగరంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు గూగుల్‌ మ్యాప్‌లో పూర్తి ప్రయాణ సమాచారాన్ని ఉంచుతున్నారు. ఎక్కడ వాహనాలు ఆగిపోయినా.. ట్రాఫిక్‌ కూడళ్ల రద్దీ ఏర్పడినా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను మ్యాప్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ ట్రాఫిక్‌ పోలీసులు ఆయా మార్గాలను వాహనదారులకు సూచిస్తున్నారు. గూగుల్‌ మ్యాప్‌లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ జాంలపై ప్రకటనలను ఉంచేందుకు 24 గంటలు ఐటీ విభాగం అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ‘గెట్‌ కనెక్టెడ్‌ గో’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్‌ జాంలపై సమాచారాన్ని గూగుల్‌ మ్యాప్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. కూడళ్లు, ముఖ్యప్రాంతాల్లో సీసీ కెమెరాలు తీస్తున్న దృశ్యాల ఆధారంగా ట్రాఫిక్‌ పరిపాలన విభాగం, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి సమాచారం నమోదుచేస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, అనుసంధాన రహదారులపై అనుకోకుండా జరిగే ఘటనలు, ర్యాలీలు ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇందుకు పరిష్కారంగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఫోన్‌యాప్‌లో ఫొటోలు తీసినా, వివరాలు పంపినా ఆ సమాచారం కమాండ్‌ కంట్రోల్‌కు వెళ్లి వెంటనే గూగుల్‌ మ్యాప్‌ చూస్తున్నవారందరికీ తెలుస్తుంది.

Read Also….  Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతి రోజు..!