Weather Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. అకాల వర్షానికి అన్నదాత విలవిల.. నేడు, రేపు భారీ వర్షాలు
Rains In Telangana: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమ(Rayalaseema) మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు..
Weather Alert: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమ(Rayalaseema) మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలే అంతంత గానే కాసిన మామిడి నేల రాలిపోయింది.
కాగా, కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కరీంనగర్, నల్లగొండ జిల్లాలో.. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసాయి. అకాల వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. లక్సెట్టిపేట వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిచి ముద్దకావడంతో.. అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా: దస్తురాబాద్ , కడెం , జన్నారం మండలాల్లో రాత్రి వర్ష భీభత్సం సృష్టించింది. దీంతో మామిడి కాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్ ఆగమాగం..
బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షం తో.. హైదరాబాద్ నగరం ఆగమైంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. నిన్న రాత్రి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చిన్నగా మొదలయిన “ఉరుములు/మెరుపులు/ఈదురుగాలుల”తో కూడిన వర్షాల తరంగం (rainy wave) క్రమంగా మధ్య, దక్షిణ (హైదరాబాద్ సహా) తెలంగాణలోని పలు జిల్లాలకు విస్తరించింది. హైదరాబాద్ సహా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణా జిల్లాలో రాత్రి/తెల్లవార్లూ ఉరుములు,మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీవర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల పిడుగులు మరియు వడగండ్ల వర్షం కూడా కురిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలుప్రాంతాలలో వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరోవైపు ఏపీలో కూడా ద్రోణీ ప్రభావంతో రాగాల 24 గంటల్లో అల్పపీడనం బలపడనున్నది. దీని ప్రభావంతో రానున్న రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులుచెప్పారు. ఈ వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయి.
Also Read: Fish Festival: చేపలు పట్టే పండుగలో భారీగా పాల్గొన్న గ్రామస్తులు.. పోటీపడి చేపట్టిన జనం..
Sunitha Singer: గానుగ చేత పట్టిన సింగర్ సునీత.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..