అర్ధరాత్రి కేక్ కటింగ్‌లకు చెక్.. ట్యాంక్‌బండ్ సహా ఆ ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక నజర్..
ఇటీవల ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి వేళ కేక్ కట్ చేద్దామని వెళ్లిన ఆ కుటుంబంపైకి మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. చిన్నారితో పాటు మరొకరిని బలితీసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో అర్థరాత్రి ట్యాంక్ బండ్ సహా రోడ్ల పక్కన కేక్ కటింగ్ చేయద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పుట్టినరోజు అంటే కుటుంబంతో, ఆత్మీయులతో కలిసి సంతోషంగా గడపాల్సిన వేడుక. కానీ ఆ కొద్దిసేపటి సరదా కోసం ఎంచుకునే సమయం, వేదిక ప్రాణాంతకంగా మారితే.. ఆ క్షణికానందం జీవితాంతం తీరని శోకాన్ని మిగిలిస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా అర్ధరాత్రి వేడుకల వెనుక దాగి ఉన్న పెను ప్రమాదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. పుట్టినరోజు వేడుక కోసం వెళ్లి ఆరేళ్ల చిన్నారితో పాటు ఆమె కుటుంబ సభ్యుడు లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. ఓల్డ్ అల్వాల్‌లోని జొన్నబండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఆరేళ్ల చిన్నారి సారక్షి పుట్టినరోజును పురస్కరించుకుని కూకట్‌పల్లిలో సినిమా చూసింది. అనంతరం రాత్రి వేళ ట్యాంక్‌బండ్‌పై హుస్సేన్‌సాగర్ అందాల నడుమ కేక్ కట్ చేయాలని నిర్ణయించుకుని అక్కడికి చేరుకున్నారు. కారును రోడ్డు పక్కన పార్క్ చేసి, కేక్ కటింగ్ కోసం కుటుంబ సభ్యులు రోడ్డు దాటుతుండగా సికింద్రాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన లారీ చిన్నారి సారక్షి, ఆమె బంధువు విశ్వనాథ్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన విశ్వనాథ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. జన్మదిన సంబరాల్లో మునిగిపోవాల్సిన కుటుంబంలో నిమిషాల వ్యవధిలోనే తీవ్ర విషాదం అలుముకుంది.
ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి కల్చర్.. పెరుగుతున్న ప్రమాదాలు
సోషల్ మీడియా రీల్స్, ఫొటోషూట్లు, మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ పేరిట అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ట్యాంక్‌బండ్‌పై యువత పెద్ద సంఖ్యలో గుమిగూడటం పరిపాటిగా మారింది. రోడ్ల పక్కనే వాహనాలను ఇష్టారాజ్యంగా పార్క్ చేయడం, డివైడర్ల మధ్య నుంచి హఠాత్తుగా రోడ్డు దాటడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గతంలోనే కేక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ఇక్కడ అర్ధరాత్రి కేక్ కటింగ్‌లను నిషేధించినప్పటికీ ప్రజల తీరులో మార్పు రాలేదు. గతంలోనూ రాత్రి వేళల్లో మితిమీరిన వేగం, హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం వంటి కారణాలతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి.
ప్రజా నిర్లక్ష్యమా.. మౌలిక వసతుల లోపమా?
ఈ తాజా ఘటన పలు మౌలిక భద్రతా లోపాలను కూడా ఎత్తిచూపుతోంది. రాత్రివేళల్లో డివైడర్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ మార్కింగ్స్ లేకపోవడం, కొన్ని చోట్ల వీధి దీపాల వెలుతురు మందగించడం, పాదచారులు రోడ్డు దాటేందుకు స్పష్టమైన ఏర్పాట్లు లేకపోవడం వంటివి రోడ్డు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పోలీసులు, జీహెచ్‌ఎంసీ కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచి, శాశ్వత ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు
అర్ధరాత్రి కేక్ కటింగ్స్ వద్దు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఈ విషాద ఘటన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల కట్టలు, ఫ్లైఓవర్లు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్స్ నిర్వహించవద్దని హెచ్చరించారు. వేడుకలను ఇళ్లలోనే లేదా సురక్షితమైన ప్రదేశాల్లో నిర్వహించుకోవాలని, క్షణకాలం సరదా కోసం రోడ్లపైకి వచ్చి అమూల్యమైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వేడుకలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
