ఇప్పటివరకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ను చూశాము. అవి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వజ్రాల పరిశ్రమలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు బంగారం విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రాబోతుందా అనే చర్చ జరుగుతోంది. అమెరికాకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అనే కంపెనీ ల్యాబ్ లోనే బంగారం తయారు చేయవచ్చని ప్రకటించి సంచలనం సృష్టించింది. వారి ప్రకటన ప్రకారం, ఫ్యూజన్ రియాక్టర్లలో ఉత్పత్తి అయ్యే శక్తివంతమైన న్యూట్రాన్లను ఉపయోగించి పాదరసం అణువుల్లో మార్పులు చేయడం ద్వారా బంగారం తయారు చేయవచ్చట. ఈ ప్రక్రియ ద్వారా పెద్ద మొత్తంలో బంగారం ఉత్పత్తి చేయగలమని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ పరిశోధన ఇంకా కంప్యూటర్ అంచనాల స్థాయిలోనే ఉందని, పూర్తిగా నిరూపించబడలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ విధంగా తయారైన బంగారంలో రేడియోధార్మిక మలినాలు ఉండే అవకాశం ఉందని, వాటిని తొలగించడం పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతి విజయవంతమై, తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బంగారం మార్కెట్ లోకి వస్తే, అది బంగారు మార్కెట్ ను పూర్తిగా మార్చేసే గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా. అయితే, ఇది వాస్తవ రూపం దాల్చడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చని నివేదించబడింది.