Hyderabad News: కండరాల కోసం యువతరం పక్కదారులు పడుతోందా? సిక్స్ ప్యాక్ కోసం జిమ్‌లు ప్రాణాలే బలిపెడుతున్నాయా? అసలు జిమ్‌ల పేరుతో నగరంలో జరుగుతోన్న అక్రమ ఇంజక్షన్ల దందా ఏమిటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. సందేహాలు.. ఈ సమయంలోనే జిమ్‌ల మాటున జరుగుతోన్న దారుణాలను తెరపైకి తెచ్చారు మైలార్ దేవులపల్లి పోలీసులు. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో.. ఒకటీ రెండూ కాదు ఏకంగా వందలకొద్దీ ప్రమాదకర మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ యువతరాన్ని వెర్రెక్కించే ఓ క్రేజ్. ఆరోగ్యం కోసం కాదు.. కండల వీరుడు సల్మాన్‌లా కనిపించాలనే తాపత్రయం.. యువతరాన్ని పెడదోవపట్టిస్తోన్న ఓ ఇంజెక్షన్ ప్రాణాలకే ఎసరెట్టేస్తోంది. దానిపేరే మెఫెంటెర్మైన్.. ప్రాణాలు తీసే ఈ ఇంజక్షన్ తో బీకేర్‌ఫుల్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మైలార్ దేవ్ పల్లిలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కండల వీరుల వెనుక అసలు వాస్తవాలను నగ్నంగా బయటపెడుతున్నాయి. 30 రోజుల్లో మరో భాషలాగా కొద్దిరోజుల్లో సిక్స్ ప్యాక్… అవలీలగా కండలు పెంచేస్తామంటూ.. అడ్డదారులు తొక్కుతున్నారు జిమ్ నిర్వాహకులు. ఎడాపెడా ప్రమాదకర మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను వాడి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. మైలార్ దేవ్‌పల్లిలో కండలపెంపకం పేరుతో జనాన్ని మోసం చేస్తోన్న జిమ్ ని గుర్తించారు. 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు. వట్టేపల్లి, దుర్గానగర్ దగ్గర ఇంజిక్షన్లు విక్రయిస్తోన్న జిమ్ ట్రైనర్ నితీష్, రాహుల్, సోహెల్ లను అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్ దందా వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతున్న యువతరం దృశ్యాలు యావత్ సమాజాన్ని కలవర పెడుతున్నాయి. జిమ్ కి వెళ్ళి భారీ కసరత్తులు చేసే వాళ్ళు అత్యంత ఆరోగ్యంగా ఉండాల్సింద పోయి.. ఎందుకిలా టపటపా రాలిపోతున్నారు.. ఇదే ప్రశ్న ఇటీవల అందర్నీ హడలెత్తిస్తోంది. ఆరోగ్యం కోసం జిమ్‌కి వెళితే ఫర్వాలేదు. కానీ కండల వీరులుగా మారాలనుకునేవారు త్వరగా కండలు పెరిగేందుకు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. అయితే, ఈ ఇంజెక్షన్లు అతిగా వాడితే ప్రాణాలకే ముప్పు అంగటున్నారు నిపుణులు.
కొన్ని శస్త్రచికిత్సల్లో వాడే ఈ మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లను కండల పెంచేందుకు విపరీతంగా వినియోగిస్తోంద యువత. యాంటీ హైపోటెన్సివ్స్ కేటగిరీలోకి వచ్చే ఈ ఇంజక్షన్లను బీపీ చికిత్స కోసం వినియోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్ల సమయంలో హార్ట్‌బీట్‌ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగిస్తారు.
కానీ ఇవే ఇంజక్షన్లను కండలపెంపకానికి ఉపయోగిస్తున్నారు జిమ్ ట్రైనర్లు..జనం ప్రాణాలను తీసేస్తున్నారు. మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్ల ధర సాధారణంగా రూ. 300 లోపు ఉంటుంది. కానీ జిమ్ములో ఇదే ఇంజక్షన్‌ని మూడు రెట్లు అధికంగా రూ. 1000 ధరకు అక్రమ అమ్మేలి లక్షల్లో డబ్బు దండుకుంటున్న జిమ్ నిర్వాహకుల నిర్వాకం హడలెత్తిస్తోంది.
డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో అమ్మాల్సిన ఈ మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్ల ఎక్కడ ఎలా దొరుకుతున్నాయన్నది ఇప్పుడు ప్రశ్న. మందుల షాపుల్లో ప్రిస్కిప్షన్ లేకుండా యథేచ్ఛగా అమ్మకాలు కూడా ఈ డ్రగ్స్ దందాకి ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు.. ఇతర రాష్ట్రా లనుంచి కూడా ఈ డ్రగ్స్‌ని రాష్ట్రంలోకి దిగుమతి చేసుకుంటున్నారంటే కండల మోసం ఎంత భయానకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..