కొత్త సంవత్సరం సందర్భంగా నగర ప్రయాణికులకు శుభవార్త అందించింది మెట్రో. శనివారం (డిసెంబర్ 31)న మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి ఒకటో తేదీ అర్ధ రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 31 న సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.అదే సమయంలో మద్యం మత్తులో మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు విధించనున్నారు. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లు మాత్రం తెరిచి ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ వైపు వాహనాలను అనుమతించరు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. నగరవాసులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.