AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..

తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఏడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్‌ రెడీ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. విమానాశ్రయ కారిడార్‌లో అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించేలా ప్రణాళిక రెడీ చేశారు.

Hyderabad Metro: హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..
Hyderabad Metro Rail
Shaik Madar Saheb
|

Updated on: Nov 27, 2024 | 9:44 AM

Share

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లాలనుకునేవారు సౌకర్యవతంగా, వేగంగా ఉండటంతో మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు సిద్ధమైంది. మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కి.మీ మెట్రోకు ప్రణాళిక రచించామని తెలిపారు. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి పంపించామన్నారు. అయితే నగరానికి ఉత్తరం వైపున ఉన్న మేడ్చల్‌ ప్రాంతానికి మెట్రో విస్తరణ లేకపోవటం ఆ ప్రాంతవాసులను నిరాశకు గురి చేస్తోంది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మెట్రో కావాలనే డిమాండ్‌ తాజాగా తెరపైకి వచ్చింది.

ఎయిర్‌పోర్టు సమీపంలో 1.06 కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో

ఐదు కొత్త కారిడర్ల విషయానికి వస్తే నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్-కోకాపేట్, ఎంజీబీఎస్‌-చంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్ ఉన్నాయి. మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్‌ డెక్కర్‌ నిర్మిస్తారు. చంద్రాయణగుట్ట జంక్షన్ వల్ల పాతబస్తీ మరింత అభివృద్ధి చెందనుంది. ఇక నాగోలు నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు 24 స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. అయితే నాలుగు స్టేషన్లు తగ్గించి 20 స్టేషన్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో 1.06 కి.మీ. మేర అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు.

పాతబస్తీలో 1100 ఆస్తులు సేకరణ

రెండో దశ మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయన్నారు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి. పాతబస్తీలో 1100 ఆస్తులు సేకరించాలని, భూసేకరణకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతుందని అన్నారు. రెండో దశలో ప్రతి కిలో మీటరుకు రూ.318 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మెట్రో స్టేషన్ల పేర్ల విషయంలో ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అలాగే మెట్రో విస్తరణలో మత పరమైన ఏ నిర్మాణాలు కూల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ఎన్వీఎస్‌రెడ్డి. ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్‌ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగానే మూడవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, మూడవ అతి పెద్ద మెట్రో నెట్వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రో నెట్వర్క్‌ అవతరిస్తుందని వెల్లడించారు. మొత్తంగా రెండోదశంలో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది.

అయితే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనులు జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..