
హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా KPHB కాలనీలో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. పశ్చిమ డివిజన్ హౌసింగ్ బోర్డు బుధవారం నిర్వహించిన ఈ వేలంలో సుమారు రూ.150 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం 18 ఇళ్ల స్థలాలకు నిర్వహించిన వేలంలో 87 మంది పోటీదారులు పాల్గొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల వరకూ విస్తీర్ణం కలిగిన స్థలాలు ఈ వేలంలో ఉంచగా.. మొత్తం 6,236.33 గజాల భూమికి రూ.141.36 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో ధరలు రావడం మొదటిసారి అని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు.
కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలు వేలంలో ఎక్కువ ధరలు పలికాయి. గజానికి కనీస ధర రూ.1.25 లక్షలు ఉండగా.. అత్యధికంగా రూ.2.98 లక్షల ధర పలికింది. ఏడో ఫేజ్‌లో నిర్వహించిన వేలంలో గజానికి రూ.2 లక్షలకు పైగా ధర వచ్చింది. ఎంఐజీ ప్లాట్‌లో గజానికి రూ.2.52 లక్షల ధర నమోదు అయ్యింది. కైతలాపూర్‌లో 36.16 గజాల స్థలానికి గజానికి రూ.1.14 లక్షల ధర పలికింది.
ఈ కార్యక్రమంలో ఈఈ కిరణ్ బాబు, ఈవో విమల, ఏఈవోలు వాసు, శ్రావణి, కార్యదర్శి రాజేశం, ఏఈఈ బిందు పాల్గొన్నారు. వేలానికి భద్రతగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజశేఖర్ రెడ్డి, డీఐ రవికుమార్ బందోబస్తు చేపట్టారు. వేలాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ నేతలను అడ్డుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.