AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మూసి, ఈసా నదులపై ఫోర్ లైన్ బ్రిడ్జిలు .. సెప్టెంబర్ 25న నిర్మాణానికి శంకుస్థాపన..!

దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ అన్నివంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహనచోదకులకు అందుబాటలోకి తీసుకునిరావాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.

Hyderabad: మూసి, ఈసా నదులపై ఫోర్ లైన్ బ్రిడ్జిలు .. సెప్టెంబర్ 25న నిర్మాణానికి శంకుస్థాపన..!
Musi Bridges
Vidyasagar Gunti
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 24, 2023 | 5:59 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్24; రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో సాకారం కానున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థలో మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సారథ్యంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో గణనీయమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మూసీనదిపైన, ఈసానదిపైన వంతెనల నిర్మాణానికి అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు(వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కరోనా (కోవిడ్) వల్ల రెండు సంవత్సరాల పాటు ఎదురైన పరిస్థితుల కారణంగా మూసి, ఈసా నదులపై వంతెనల నిర్మాణ కార్యాచరణలో జాప్యం చోటుచేసుకుంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు(3) చోట్ల, ఈసానదిపై రెండు(2) చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ముందడుగు పడింది. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు(5) వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండిఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యుర్మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.

హెచ్ఎండిఏ నిర్మించే ఐదు వంతెనల నిర్మాణ ఇవి :

ఇవి కూడా చదవండి

1. రూ.42కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద

2. రూ.35కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి వద్ద

3. రూ.39కోట్లతో మంచిరేవుల వద్ద

4. రూ.32కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై

5. రూ.20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనల నిర్మాణాలను చేపట్టనున్నది.

ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసిపై నాలుగు వరుసల(ఫోర్ లైన్) వంతెన నిర్మాణం జరుగనున్నది.

టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయినందున మంత్రి కేటీ ఆర్‌ సోమవారం (25వ తేదీన) శంకుస్థాపన చేయనున్నారు. ఐదు వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ అన్నివంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహనచోదకులకు అందుబాటలోకి తీసుకునిరావాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి