Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ.. ఔషధాల ముసుగులో దందా.. చివరకు..
ఔషధాల తయారీ ముసుగులో నిషేధిత డ్రగ్స్‌ను తయారీ చేస్తూ విచ్చలవిడిగా యువతకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పులిచర్ల శ్రీనివాస్ రెడ్డి సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
Rachakonda police: ఔషధాల తయారీ ముసుగులో నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఔషధాల తయారీ ముసుగులో నిషేధిత డ్రగ్స్‌ను తయారీ చేస్తూ విచ్చలవిడిగా యువతకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పులిచర్ల శ్రీనివాస్ రెడ్డి సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బీఫార్మసీ పూర్తి చేసి, ఫార్మా కంపనీలో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఈజీ మనీ కోసం కెమికల్స్‌తో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తూ 2010లో చెన్నై NCB అధికారులకు, 2014లో హైదరాబాద్ NCB అధికారులకు చిక్కాడు. ఆ తర్వాత 2015లో కీసర పోలీస్ స్టేషన్, 2018 ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లోను శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
కొంత కాలంగా హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి, లెనిన్ బాబులు సింథటిక్ డ్రగ్స్ ద్వారా కొకైన్ ,ఎఫిడ్రిన్, మేథమైన్ తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్ తోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నెపోలియన్ అనే చెన్నైకి చెందిన రిసీవర్ ద్వారా ఈ డ్రగ్స్ ను ఎగుమతి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా గుట్టును రట్టు చేసి నిందితులు నుండి 30 లక్షలు విలువైన నిషేదిత డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
సింథటిక్ డ్రగ్స్ 53 గ్రాములు, నార్కోటిక్ లిక్విడ్ 3 కేజీలు, LSD డ్రగ్ ఒకటి, కొకైన్ క్యాప్సిల్స్, డిజిటల్ వెయిట్ మిషన్, గ్లాస్ రియాక్టర్, హైడ్రో క్లోరైడ్ 50 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. రిసీవర్ నెపోలియన్ కోసం గాలిస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..