Hyderabad: అప్పటివరకు అంతా ఆనందం.. అంతలోనే విషాదం.. తల్లిదండ్రులకు కడుపుకోత
నీటితో ఆటలొద్దు. పెద్ద వాళ్లు పిల్లలకు చెప్పే మాట. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా.. వినకపోయినా.. ఏమౌతుందో మనకు కళ్లకు కడుతోంది ఈ విషాద ఘటన.
ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా బయటకు వెళ్లారు. నీటి సెలయేళ్ల మధ్య ఆడుతున్నారు. అప్పటి వరకు ఒక్కటే కేరింతలు, అంతకు మించిన పకపకలు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు అవుతుంది. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వచ్చిన ప్రణీత్ నీటిలోకి దిగాడు. ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో నీటి లోతు తెలియనుందున ప్రమాదవశాత్తు నీట మునిగాడు. నీటి మధ్య ఆడుకుంటున్న స్నేహితులు ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. ఓ వైపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, లోతును అంచనా వేయలేకపోవడం, ప్రణీత్‌కు ఈత రాకపోవడంతో.. ప్రమాదానికి గురయ్యారు. ఆలస్యంగా అది గమనించిన ఫ్రెండ్స్ అతన్ని ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. అతని స్పృహాలోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్నాక ప్రణీత్‌ను గమనించిన వైద్యులు అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన 18 ఏళ్ల పోతనపల్లి ప్రణీత్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి ఓ.ఆర్.ఆర్ పెద్ద అంబర్‌పేట బ్రిడ్జి వద్ద కాలువలో సరదాగా ఆడుకునేందుకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనతో స్నేహితులంతా విషాదంలో మునిగిపోయారు. ఈ విషయంలో తెలిసి ప్రణీత్ పేరెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. భారీ ఆశలతో పెంచుకుంటున్న బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అసలే నీరు, ఆపై ఈత కూడా రాదు. అలాంటి వారు నీటిలోకి దిగితే ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెప్తోంది ఈ ఘటన.
Also Read: నేడు ఏపీలో బంద్.. టీడీపీ నేతల ఆందోళన.. ముందస్తు అరెస్టులు.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బలగాలు