Hyderabad: చెడ్డీ గ్యాంగ్ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లో ఆరుగురు అనుమానితులు చోరీకి పాల్పడిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్, విల్లా యాజమాన్య కమిటీలకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కీలక భద్రతా సూచనలు జారీ చేశాయి. ప్రహరీల వెంట చీకటి ప్రాంతాలు, విరిగిన ఫెన్సింగ్, CCTV కవరేజ్ లేని ప్రదేశాలను గుర్తించి లైటింగ్, కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించాయి.

హైదరాబాద్ శివార్లలో చెడ్డీగ్యాంగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఆరుగురు దొంగలు మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు.. ఫెన్సింగ్‌ను కట్‌చేసి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన చెడ్డీగ్యాంగ్.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.. చెడ్డీగ్యాంగ్‌ను గమనించి ప్రశ్నించిన ఒకరిపై దాడి చేయడంతోపాటు.. ఆయుధాలతో బెదిరించారు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రెసిడెన్షియన్ వెల్ఫెర్ అసోసియేషన్స్ (Residential Welfare Associations) కీలక ప్రకటన చేసింది. సోమవారం తెల్లవారుజామున నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోని ఒక ఫ్లాట్‌లోకి ఆరుగురు అనుమానిత చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చొరబడిన ఘటన నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని అపార్ట్‌మెంట్ యజమానులకు నివాస సంక్షేమ సంఘాలు (ఆర్‌డబ్ల్యూఏలు) సోమవారం భద్రతా సలహా జారీ చేశాయి.
ప్రహరీ గోడల వెంబడి, ముఖ్యంగా లైటింగ్ లేదా సీసీటీవీ కవరేజ్ లేని చీకటి ప్రాంతాలలో నిఘాను పటిష్టం చేయాలని.. సిబ్బందిని అప్రమత్తం చేయాలని అపార్ట్‌మెంట్, విల్లా యాజమాన్య కమిటీలకు సూచనలు చేశాయి. భద్రతా బృందాలు ప్రధానంగా గేట్లపై దృష్టి సారిస్తుండగా, నేరస్థులు తరచుగా ఇలాంటి బలహీన ప్రదేశాలను ఉపయోగించుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి, దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నారని తెలిపింది.
కాంపౌండ్ సరిహద్దులలో చీకటి ప్రదేశాలు, విరిగిన కంచెలు, సీసీటీవీకి కనిపించని ప్రదేశాలను తనిఖీ చేయాలని కమిటీలకు, భద్రతా సిబ్బందికి సూచనలు చేసింది.
అన్ని ప్రమాదకర ప్రదేశాలలో తగినంత లైటింగ్, కెమెరాలను ఏర్పాటు చేయాలి.. అదే సమయంలో ముఖ్యంగా రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య పరిసర గస్తీని పెంచాలని నివాస సంక్షేమ సంఘాలు సూచించాయి.
అల్కాపూర్ టౌన్‌షిప్, పొరుగు కాలనీలలో, ముఖ్యంగా నాలా సమీపంలో, సరస్సు తీర ప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, ఇతర సున్నితమైన ప్రవేశ మార్గాల వద్ద రాత్రిపూట పోలీసు గస్తీని పెంచాలని నివాసితులు కోరారు.
గేట్లు, తలుపులు, ప్రహరీ కంచెలను భద్రపరచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద కదలికల గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని.. సంబంధిత సీసీటీవీ ఫుటేజీని వెంటనే పంచుకోవాలని రెసిడెన్షియన్ వెల్ఫెర్ అసోసియేషన్స్ ప్రకటనలో తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
