Telangana: బాలాపూర్ లడ్డూ(Balapur Laddu) ధర రికార్డ్ బ్రేక్ అయింది. ఎవరూ ఊహించని విధంగా అల్వాల్(Alwal)లోని కనాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూ రికార్డ్ స్థాయిలో వేలం పలికింది. 45 లక్షలకుపైగా గణపతి లడ్డూ అమ్ముడు పోయింది. అల్వాల్‌లోని కనాజీగూ మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. అయితే శనివారం జరిగిన వేలం పాటలో 45 లక్షల 99 వేల 999 రూపాయలకు అక్కడి గణపతి లడ్డూను గీతాప్రియ, వెంకటరావు అనే దంపతులు కైవసం చేసుకున్నారు. బాలాపూర్ కంటే ఇక్కడి లడ్డూకు వేలంలో ఎక్కువ పలకడం విశేషం. గతేడాది కూడా ఇక్కడి గణేశ్ లడ్డూను ఆ దంపతులే దక్కించుకున్నారు. గణనాథుని కటాక్షంతో తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని..అందుకే ఈ ఏడాది కూడా లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నామని తెలిపారు. లడ్డూ వేలంలో వచ్చిన డబ్బును అన్న ప్రసాద వితరణకు, ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కాగా భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ సంఖ్యలో విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. శుక్రవారం నుంచి వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. ఐతే వర్షానికి తోడు కొన్ని క్రేన్లు మొరాయించడంతో… నిమజ్జనం ఆలస్యమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 89వేల విగ్రహాల నిమజ్జనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఐతే ఎన్నడూ లేనంతగా హుస్సేన్‌సాగర్‌లో ఈసారి 10వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..