Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Waves: ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల టెంపరేటర్ దాటాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. కేరళపై అతినీల లోహిత కిరణాల పంజా విసురుతున్నాయి. కేరళలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది.

Heat Waves: ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త
Heat Wave
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2025 | 9:20 PM

భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు…! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. కాదుకూడదని బయట అడుగుపెడితే… సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్‌ మార్చి కూడా దాటలేదు. ఫిబ్రవరి నుంచి మొదటి నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇక ఈ నెల మొదటి వారం నుంచే వేడి పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణలో మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారేతిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో అతినీలలోహిత కిరణాలు తీవ్రత తీవ్రరూపం దాల్చాయి. వాతావరణ కాలుష్యం, ఓజోను పొరకు రంధ్రాలు తదితర కారణాలతో యూవీ ఇండెక్స్‌ ‘అత్యంత ప్రమాదకర కేటగిరీ’లోకి చేరింది. దీంతో కేరళలోని పలు జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో ఇది 11 పాయింట్లుగా నమోదైంది. ‘11’ దాటితే అత్యంత ప్రమాదకర కేటగిరీలోకి చేరినట్లు లెక్క. యూవీ కిరణాల తీవ్రత పెరిగే కొద్దీ ఓజోన్‌ పొర మందం తగ్గుతుంది. మనుషుల్లో చర్మ సంబంధిత సమస్యలు, కళ్ల రుగ్మతలకు కారణమవుతాయి. చర్మ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, మత్స్యకారులు, వాహనదారులు, పర్యాటకులు, చర్మ, కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు నేరుగా అతినీలలోహిత కిరణాల బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బయటికి వెళ్లేటప్పుడు నూలు దుస్తులు, గొడుగులు, టోపీలు, కంటి అద్దాలు వంటివి ధరించాలని సూచించింది.