Heavy Rain: ఒక్కసారిగా దంచికొట్టిన వాన‌… రోడ్లన్నీ జ‌ల‌మ‌యం.. జనం తిప్పలు చూడాలి..!

|

Jul 14, 2024 | 9:57 PM

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాత్రి 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది. 1 లక్ష 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా అంతరాయం కలిగింది. ఈ వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షంతో బేతుపల్లి చెరువు నిండు కుండలా మారింది.

Heavy Rain: ఒక్కసారిగా దంచికొట్టిన వాన‌… రోడ్లన్నీ జ‌ల‌మ‌యం.. జనం తిప్పలు చూడాలి..!
Heavy Rain
Follow us on

చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలను పలకరించాయి వర్షాలు. ఈసారి మాత్రం గట్టిగానే దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా రెండు రాష్ట్రాలు వానల్లో తడిసి ముద్దవుతున్నాయి. ఇక ఏజన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్‌ తడిసి ముద్దయిపోయింది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, గోల్కొండ, హిమాయత్‌ నగర్‌, కూకట్‌పల్లి, మంగళ్‌హాట్‌, ఉప్పల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షంతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. ఇక పీవీఆర్‌ థియేటర్‌ వద్ద వర్షం కురవడంతో ప్రేక్షకులు నానా ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాలతో ఆదిలాబాద్‌ కుంటాల జలపాతం జల కళ సంతరించుకుంది. ఖమ్మం సింగరేణిలో భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాత్రి 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది. 1 లక్ష 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా అంతరాయం కలిగింది. ఈ వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షంతో బేతుపల్లి చెరువు నిండు కుండలా మారింది.

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీని భారీ వర్షం ముంచెత్తింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొత్తపల్లి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు.

ఇవి కూడా చదవండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎన్టీఆర్‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కట్టలేరు వాగు బ్రిడ్జి వైపు జనం వెళ్లకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచించారు.

రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మన్యం ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. మునగాల దగ్గర వరద ఉధృతి ధాటికి ఆర్‌ అండ్‌ బీ అప్రోచ్‌ రోడ్‌ కొట్టుకుపోయింది. దీంతో కోరుకొండ – మునగాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. సీతానగరం వైపు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కోతకు గురైన మార్గాన్ని జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ పరిశీలించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..