హైదరాబాద్‌లో వీధి కుక్కల బెడద ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు ఏదో ప్రాంతంలో వీధి కుక్కల దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ.. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఈ దృశ్యాలు అందరినీ కలచివేశాయి. అయితే.. ఆ ఘటనపై టీవీ9 వరస కథనాలతో కుక్కల నియంత్రణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. కానీ.. ఆ కమిటీ నత్తనడకన నెలరోజుల్లో నాలుగు రోజులు తిరిగి.. 26 అంశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో 25 అంశాలకు మేయర్ ఆమోదం తెలిపినా.. వాటి అమలు దేవుడెరుగు అన్నట్లు తయారైంది. ఇక ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయినా.. గ్రేటర్ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. హైలెవెల్ కమిటీ నివేదికపై ఈ నెల 6న మీటింగ్ పెట్టి 25 అంశాలు ఆమోదించి అమలు చేస్తున్నామని జీహెచ్ ఎంసీ మేయర్ ప్రకటించారు. కానీ.. 15 రోజులు దాటినా ఒక్క ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు. దాంతో.. హైలెవెల్ కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష కార్పొరేటర్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. హైలెవల్ కమిటీ సిఫార్సులపై మేయర్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్.
ఏదైనా ఘటన జరిగితే కానీ స్పందించేలా లేని బల్దియా యంత్రాంగం తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ నెల 13న హైలెవెల్ కమిటీ రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉన్నా దాన్ని పట్టించున్న దాఖలాలు లేవు. ఎండాకాలం కుక్కల కోసం వాటర్ బౌల్స్ ఏర్పాటు కూడా చేయలేని స్థితిలో బల్దియా ఉంది. దాంతో జీహెచ్ఎంసీ వెటర్నీరి విభాగం తీరు, మేయర్ చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన లేకపోవడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణపై తీసుకోవాల్సి చర్యలకు సంబంధించి హైలెవల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి 15 రోజులు దాటినా పట్టించుకోవడంలేదని, కమిటీ వేసినట్లు కుక్కలకు తెలీయదంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పైసెటైర్లు వేశారుహైలెవల్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్. ఇక అంబర్‌పేట ఘటనకు మూడు నెలలు కావస్తున్నా కుక్కుల దాడుల విషయంలో జీహెచ్ఎంసీ చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. బల్దియా నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా.. దీర్ఘకాలిక చర్యలు చేపట్టడంలో మేయర్, అధికారులు అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే.. మేయర్ సహా పాలకమండలి తీరుపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. హైలెవెల్ కమిటీ నివేదిక అమలు వ్యవహారం అగమ్యగోచరంగా మారుతోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..