Hyderabad: ఇదేం పోయేకాలంరా.. బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సహకరించకపోవడం.. వాగ్వాదానికి దిగడం.. న్యూసెన్స్ చేయడం ఇప్పటివరకు చూశాం. తాజాగా బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు ఓ కేటుగాడు.
ఇటీవల హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చాలా చోట్ల వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న క్రమంలో వింత ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసులు ఒక బైక్ పై వెళుతున్న ఇద్దరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసేందుకు ఆపారు. బైక్‌పై వెనకాల కూర్చున్న వ్యక్తి విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ బాడీ వారిని కెమెరాను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సిసి కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బాడీ కెమెరాను ఎత్తుకెళ్లిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు వాడిన బండి సైతం వారిది కాదు అని తేలింది. సీసీ కెమెరాల ద్వారా బైక్ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు అడ్రస్‌ను ట్రేస్ చేశారు. అయితే ఆ బండి నంబర్ ప్లేట్‌పై ఉన్నది ఒరిజినల్ నెంబర్ కాదని గుర్తించారు. ఫేక్ నెంబర్ ప్లేట్ ఉపయోగించినందుకు మరొక కేసు కూడా నారాయణగూడ పోలీసులు నమోదు చేశారు
ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు ఆ బైక్‌ను సైతం దొంగలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల నుండి బ్రీత్ అనలైజర్ డివైజ్‌ను అంబర్‌పేట్‌లో చోరీ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా మందుబాబులు చేసిన ఈ పనితో పోలీసులు కంగుతున్నారు. ఏకంగా పోలీస్ మెడలో ఉండే బాడీ కెమెరాను ఎత్తుకెళ్లడం ఆ శాఖలో చర్చనీయాంశం అయింది.
చాలా సంవత్సరాల క్రితం స్పాట్ చలాన్లు విధించే క్రమంలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి ఉన్నతాధికారులు ఈ బాడీ కెమెరాలను ప్రవేశపెట్టారు.. దీని ద్వారా లంచం డిమాండ్ చేసినా లేదా ఎవరైనా లంచం ఇచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు అ దృశ్యాలు వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులకు ఈ బాడీ వార్న్ కెమెరాలను అమర్చారు. ఇప్పుడు ఏకంగా ఈ కెమెరానే మందుబాబులు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..