Drunk and Drive Cases: తాగుతున్నారు.. తోలుతున్నారు.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.. వీళ్లు మారరా..?

సీసా చిన్నదైనా సరే.. తాటికాయంత అక్షరాలు. మద్యపానం ఆరోగ్యానికి హాని కరం అనే అక్షరాలు..కళ్లకు కనిపించడం లేదా?. సరే.. మీ ఆరోగ్యం, మీ డబ్బు.. మీ ఇష్టం. తాగండి తగలెయ్యండి.

  • Ram Naramaneni
  • Publish Date - 7:58 pm, Sun, 28 February 21
Drunk and Drive Cases: తాగుతున్నారు.. తోలుతున్నారు.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.. వీళ్లు మారరా..?

Drunk and Drive Cases: సీసా చిన్నదైనా సరే.. తాటికాయంత అక్షరాలు. మద్యపానం ఆరోగ్యానికి హాని కరం అనే అక్షరాలు..కళ్లకు కనిపించడం లేదా?. సరే.. మీ ఆరోగ్యం, మీ డబ్బు.. మీ ఇష్టం. తాగండి తగలెయ్యండి. తాగి రోడ్ల మీదకు ఎందుకు వస్తున్నారు?. అమాయకుల ప్రాణాలెందుకు బలి తీసుకుంటున్నారు?. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే ఈ పరిస్థితి మారుతుంది?. పబ్లిక్‌లో మార్పు వస్తుంది?

ఐదేళ్ల క్రితం… చిన్నారి రమ్య గుర్తుందా?. జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే ఉందా సంఘటన… కోలాహలంగా ఉన్న ప్రయాణంలో ఒక్కసారిగా హాహాకారాలు. ఆర్తనాదాలు. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని, పిల్లల నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది ఆ సంఘటన. అందర్నీ పోగొట్టుకుని ఆ కుటుంబంలో వాళ్లు పడ్డ ఆవేదన వర్ణనాతీతం. పట్టపగలు పీకలదాకా తాగి బీటెక్ విద్యార్థులు కారు నడిపి పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద నుంచి చేసిన యాక్సిడెంట్ గుర్తుందా..? ఆ తాగుబోతులు చేసిన పాపానికి నాలుగు కుటుంబాలలో తీరని విషాదం నింపింది.

చిన్నారి రమ్య ఆశల్ని చిదిమేసింది. ఆ కుటుంబాన్ని విషాద సాగరంలో ముంచేసింది. స్పాట్‌లోనే రమ్య బాబాయ్ చనిపోతే… చిన్నారి రమ్య 9 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అదే ప్రమాదంలో గాయపడిన రమ్య తాతయ్య 18 రోజుల తర్వాత చనిపోయారు. నలుగురు బీటెక్ స్టూడెంట్లు తప్పతాగి కారు నడిపిన చేసిన తప్పు వల్ల ఆ కుటుంబం అన్ని రకాలుగా కోలుకోలేని రీతిలో నష్టపోయింది. యాక్సిడెంట్‌ చేసిన విద్యార్ధి సోహైల్ మైనరు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ప్రమాదం జరిగాక పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి లైసెన్స్‌లు లేని మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు మందు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత మరచిపోవడం ఆనవాయితీగా మారింది తప్ప శాశ్వత చర్యలు శూన్యం.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్న వాళ్లలో చాలా మంది సొసైటీలో చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్లు. ఉన్నత చదువులు చదివిన వాళ్లు.. వాళ్లకు చట్టాల గురించి తెలుసు. తాగి వాహనం నడపకూడదని కూడా తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యం. తాగితే శరీరం, మైండ్ కంట్రోల్‌లో ఉండదు. వాహనం ఎటు పోతుందో అర్థం కాదు. స్పీడ్‌ని నియంత్రించలేరు. ఏదైనా జరిగితే కార్లో ఉన్న వారితో పాటు.. రోడ్డు మీద పోతున్న వాళ్లకు కూడా ప్రమాదమే. అన్నీ తెలిసినా… వీకెండ్‌లో ప్రమాదాలు తగ్గడం లేదు. తాగండి.. కానీ కారు మీరు నడపవద్దు.. డ్రైవర్లను పెట్టుకోండి అని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే మాకు కాల్ చేయండి డ్రైవర్‌ను పంపిస్తాం అంటూ కొన్ని సంస్థలు కొత్తగా సేవల్ని ప్రారంభించాయి. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా తాగుబోతుల తీరు మారడం లేదనడానికి షణ్ముక్‌ సంఘటనే నిదర్శనం.

ఏంటి వీళ్ల అహంకారం.. సొసైటీలో తమకున్న పేరు, పలుకుబడి చూసుకునా?. సెలబ్రిటీ అనే హోదానా?. తాము చట్టాలు, నిబంధనలకు అతీతం అని భావిస్తున్నారా?. తాగి అడ్డంగా దొరికిన తర్వాత కూడా పోలీసుల మీద దాడికి దిగడం, నేనెవరో తెలుసా పోలీసులతో వాదించడం, వార్నింగ్లు ఇవ్వడం చూస్తుంటే మందుబాబుల మైండ్‌సెట్ ఎలా ఉందో అర్థమవుతుంది.

సామాన్యుల విషయంలో లాఠీలతో విరుచుకు పడే నాలుగో సింహం… హై ప్రొఫైల్ వ్యక్తుల్ని చూసే సరికి తోక ముడుస్తోంది. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్న వాళ్లు, దొరికాక పోలీసులతో వాదిస్తున్న కేసులన్నీ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. తాగుబోతుల వల్ల జరుగుతున్న ప్రమాదాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ. సిటీలోని మిగతా ఏరియాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. బడాబాబుల విషయంలో పోలీసుల మెతక వైఖరి వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు…