లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ సిద్దం అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే13న పోలింగ్ నిర్వహించారు.ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీ సీరియస్‌గా మారింది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తు ప్రచారంలో వేగం పెంచారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ నుండి గెలిచి లాస్య నందిత అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ రెఢి అయింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుండి సాయన్న కుటుంబానికి మరోసారి అవకాశం లభించింది. సాయన్న మరో కూతురు నివేదిత బరిలో నిలిపారు గులాబీ బాస్. గత ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలో నిలిచి రెండవ స్థానానికి పరిమితం అయిన శ్రీ గణేష్‌ను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. కాస్త ఆలస్యంగా బీజేపీ తమ అభ్యర్థిని వంశ తిలక్‌ను రంగంలోకి దించింది. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరా హోరీ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని స్థానికంగా పట్టు ఉన్న శ్రీ గణేష్‌ను బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నలకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. ఉప ఎన్నికలో మాత్రం మొండి చెయ్యి చూపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 41 వేల ఓట్ల తో రెండవ స్థానం కి పరిమితం అయిన శ్రీ గణేష్‌ను పోటీలో నిలిపింది. ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ తెచ్చిన ఆరు గ్యారెంటీలు, స్థానికంగా తనకు ఉన్న పట్టు, సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్.
ఇక బీఆర్‌ఎస్ మాత్రం బై పోల్ గెలవడం కోసం మరోసారి సెంటిమెంట్‌కు ఛాన్స్ ఇచ్చింది. సాయన్న కుటుంబానికి మరో అవకాశం కల్పించింది. కంటోన్మెంట్ నియోజకవర్గంతో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సాయన్నకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సాయన్న. ఆయనపై ఉన్న అభిమానం..గత ప్రభుత్వంలో చేసిన అభివృద్దితో కంటోన్మెంట్ ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు గులాబీ నేతలు.
లేట్‌గా అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. గెలుపులో మాత్రం ముందు ఉంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని రెఢి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన శ్రీగణేష్ పార్టీ వీడినప్పటికీ.. బలమైన అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చింది. రాజకీయంగా కొత్త అయినప్పటికీ వైద్యుడిగా, కుటుంబ పరంగా నియోజకవర్గంలో పార్టీలో పేరున్న వ్యక్తి వంశ తిలక్. తండ్రి పద్మశ్రీ అవార్డు గ్రహీత, తల్లి సదా లక్ష్మి మొట్ట మొదటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, కొత్త నేత కావడం, లోకల్ గా ఉన్న మిగతా నాయకులు సహకారం ఏ విధంగా ఉంటుందన్నదీ ప్రశ్న. గత ఎన్నికలో రెండో స్థానానికి పరిమితం అయిన బీజేపీ, ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుస్తామని ధీమా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..