
విమాన ప్రయాణం.. అంటేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, గతకొంతకాలంగా ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్న సంఘటనలు కూడా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంఘటన యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. విమానం టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 274 మంది వరకు మరణించారు.
ఇలాంటి విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ వినాశ్రయానికి వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని రొమానియా నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) ఎయిర్ పోర్టుకు తిరిగి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై సంబంధిత అధికారులు అలర్ట్ అయ్యారు. బెదిరింపు కాల్ పై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ దుర్ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఆయన భౌతికకాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ అధికారులకు పెను సవాలుగా మారింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, వారి ఆనవాళ్లను పట్టి బంధువులకు అప్పగించడం అత్యంత కష్టతరంగా తయారైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..