Bathini Harinath Goud passes away: చేపమందు ప్రసాదంతో బత్తిని సోదరులు ప్రాచుర్యం పొందారు. వారిలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ చనిపోవడం కుటుంబంలో విషాదం నింపింది. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పరిస్థితి విషమించి హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల చేపమందు పంపిణీ సమయంలో ఆయన వీల్‌చైర్‌లోనే అక్కడకు వచ్చారు. ప్రతీఏటా మృగశిరకార్తెరోజు వారు ఉబ్బసం రోగులకు చేపమందు పంపిణీ చేస్తుంటారు. గత 173 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ చేపమందు ఇస్తూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బత్తిన సోదరులు కూడా కొనసాగించారు. బత్తిని హరినాథ్‌గౌడ్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. రేపు ఆయన దహనసంస్కారాలు ఉంటాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
బత్తిని సోదరులు ప్రతి ఏటా మృగశిర కార్తిక రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి చేప మందు పంపిణీ చేస్తుంటారు. అనారోగ్య సమస్యలతోనే చేపమందు ప్రసాదం పంపిణీ విషయంలో ఎంతో ఆసక్త కనబరిచే వారిని బత్తినేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, హరినాథ్ గౌడ్ కొన్ని సంవత్సరాల నుంచి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే అనారోగ్యంతో మరణించారని కుమార్తె అర్చన గౌడ్ కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
‘‘తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆస్తమా వ్యాధి బాధితులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరులలో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ గారి మరణం విచారకరం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దశాబ్దాలుగా, నిష్టతో బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. ప్రజల నమ్మకాన్ని, బత్తిన సోదరులు చేస్తున్న సామాజిక సేవను గౌరవిస్తూ…నాడు ప్రభుత్వ పరంగాను, వ్యక్తిగతంగాను చేప ప్రసాదం పంపిణీకి సహకరించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. హరినాథ్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అంటూ చంద్రబాబు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..