Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ పడుతూ కనిపించిన ప్రయాణికుడు.. చెక్ చేయగా
మన హైదరాబాద్ నగరవాసి.. బ్యాంకాక్ వెళ్లి తిరిగి శంషాబాద్‌లో ప్లైట్ దిగాడు. అయితే అతని ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంది. అంతేకాదు.. టెన్షన్ పడుతూ కనిపించాడు. ఇతగాడి గురించి అధికారులకు ముందుగానే సమచారం వచ్చింది. దీంతో అదుపులోకి తీసుకుని చెక్ చేయగా...

ఆగస్టు 13, బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ్యాంకాక్ నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అయితే ఎందుకో తెలియదు కానీ అతను బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఇతగాడి గురించి అధికారులకు ముందుగానే సమాచారం వచ్చింది. దీంతో యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ రంగంలోకి దిగి అతని లగేజ్ అంతా చెక్ చేసింది. ఈ సమయంలో అతని వద్ద 6.30 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. బ్యాంకాన్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు నగరానికి చెందిన షేక్ అథర్ ఇబ్రహీంగా గుర్తించారు. అతను తన బ్యాగులో హైడ్రోపోనిక్ గంజాయిని దాచినట్లు అధికారులు చెప్పారు.
ఆగ్నేయాసియా దేశమైన థాయిలాండ్‌లో హైడ్రోపోనిక్ గంజాయి ఎక్కడ సరఫరా అవుతున్నట్లు సమాచారం. నాణ్యతను బట్టి.. దీని ధర కిలోకు రూ.30 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఉంటుంది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణ సాగులో గంజాయి మట్టిలో పెరుగుతుంది కదా..! కానీ హైడ్రోపోనిక్ పద్ధతిలో మొక్కల వేర్లు నేరుగా పోషకాలతో నిండిన నీటిలో ముంచి పెంచుతారు. దీని వల్ల మొక్కలకు అవసరమైన ఆక్సిజన్, నీరు, పోషకాలు దండిగా అందుతాయి. ఈ పద్ధతిలో పెరిగే గంజాయి సాధారణ పద్ధతితో పోలిస్తే వేగంగా పెరిగి.. అధిక శక్తివంతమైన మత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
