AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చావు ఏ వైపు నుంచి వస్తుందో ఊహించగలమా.. అంతా క్షణాల్లోనే.. ఈ వీడియో చూస్తే..

రద్దీగా ఉండే రోడ్డుపై క్షణాల్లో జరిగిన ఘోరం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాలానగర్‌లో ఇనుప పైపుల లోడుతో వెళ్తున్న ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడటంతో పక్కనే వెళ్తున్న స్కూటీపై ఆ భారీ పైపులు కుప్పకూలాయి. తేరుకునే లోపే పైపుల కింద నలిగిపోయిన బైక్ రైడర్ రక్తపు మడుగులో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Hyderabad: చావు ఏ వైపు నుంచి వస్తుందో ఊహించగలమా.. అంతా క్షణాల్లోనే.. ఈ వీడియో చూస్తే..
Balanagar Road Accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 08, 2026 | 5:37 PM

Share

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుప పైపుల లోడుతో వేగంగా వెళ్తున్న ఒక ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడటంతో పక్కనే వెళ్తున్న స్కూటీపై ఆ పైపులు కుప్పకూలాయి. ఈ హృదయ విదారక ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాలానగర్ ప్రధాన రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఆ సమయంలో పరిమితికి మించిన ఇనుప పైపుల లోడుతో ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అదే సమయంలో దాన్ని పక్క నుంచు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై భారీ బరువున్న ఇనుప పైపులు వచ్చి పడ్డాయి. అసలేం జరుగుతుందో గుర్తించేలోపే పైపుల కింద చిక్కుకుపోయిన వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచాడు.

సహాయక చర్యలు.. దర్యాప్తు ముమ్మరం

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద ఉన్న వివరాల ఆధారంగా అతని గుర్తింపును నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పైపులను, బోల్తా పడిన ఆటో ట్రాలీని క్రేన్ల సాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిబంధనలు గాలికొదిలేస్తే ప్రాణాలకే ముప్పు

నగరంలోని రద్దీ రోడ్లపై భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇనుప పైపులు, రాడ్లు, భారీ లోడ్లతో వాహనాలు తిరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పరిమితికి మించి సామాన్లు ఎక్కించడం వల్లే ఇలాంటి విషాదాలు రిపీట్ అవుతున్నాయని ఆవేదన చెందారు. ఇలాంటి ఓవర్‌లోడ్ వాహనాలపై ట్రాఫిక్ విభాగం కఠినంగా నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us