Watch Video: ఓరి దేవుడా.. పసివాడి పాలిట యమపాశంగా మారిన ఇంటి గేటు! ఊరంతా కన్నీటి సంద్రమే..
7 Year Old Boy Dies After under construction building Gate Collapses on him In Medchal District: నిర్మాణంలో ఉన్న భవనానికి ముందు ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడిపోవడంతో దుంపల గ్రామానికి చెందిన ఆకాష్ అనే ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు..

మేడ్చల్, నవంబర్ 13: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట్ ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణంలో జరిగిన ప్రమాదం ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిర్మాణంలో ఉన్న భవనానికి ముందు ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడిపోవడంతో దుంపల గ్రామానికి చెందిన ఆకాష్ అనే ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన ఆకాష్ తన తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వారు ఆ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఉదయం ఆకాష్ భవనం ప్రాంగణంలో ఆడుకుంటూ గేటు దగ్గరకు వెళ్లగా, ఆకస్మాత్తుగా గేటు కూలిపడటంతో బాలుడు దానికింద నలిగిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని బయటకు తీసి, సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవనం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా పనులు కొనసాగించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గేటు బరువు, నిర్మాణ పద్ధతులు, భద్రతా లోపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బౌరంపేట్ ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది. పోలీసులు బిల్డర్‌పై నిర్లక్ష్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




