జవహర్ నగర్, జులై 17: ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిని వీధి కుక్కలు ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే చికిత్స పొందుతున్న చిన్నారి తాజాగా మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్, లక్ష్మి దంపతులు. వీరికి నిహాన్ (18 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. నెల రోజుల క్రితం ఉద్యోగం కోసం బాలాజీనగర్ వికలాంగుల కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి భరత్, లక్ష్మి దంపతులు కుమారుడితో సహా వచ్చారు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో దంపతుల కుమారుడు నిహాన్ ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి బయట బాలుడు ఆడుకుంటూ ఉండగా.. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు బాలుడిని లాక్కెళ్లాయి.
రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి విహాన్ చారిపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు రాళ్లు విసరడంతో కుక్కలు ఎక్కడికక్కడ పారిపోయాయి. రోడ్డుపై అచేతనంగా పడిఉన్న బాలుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించడంతో.. అతడి పరిస్థితి విషమించడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయాడు రెండేళ్ల విహాన్ చారి. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి ఒంటిపై కుక్కకాట్ల దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందకిపైగా కాట్లు బాబు ఒంటిపై ఉన్నాయ్. తల నుంచి కాలి వరకూ పీకేశాయ్. హృదయాల్ని కదిలించివేసేంత దారుణంగా ఆ దృశ్యాలు ఉన్నాయ్. నెలల పసికందుని అలాంటి పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా ఇలీవల కాలంలో చిన్నారులపై వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి.
జూలై 16న జగిత్యాలలోని బీర్పూర్ మండలం మనగెలలో వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్కలు బాలుడిపైకి దూకి ముఖం, చెవులు, తలపై తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు కర్రలతో కుక్కను అదిలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. తీవ్రంగా గాయడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజు క్రితం ఘట్ కేసర్‌లో కూడా ఇద్దరు మహిళలపై వీధికుక్కలు దాడి చేశాయి. మరోవైపు గత బుధవారం సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేయడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇలా గడిచిన వారం రోజుల్లోనే వీధి కుక్కల దాడుల ఘటనలు నాలుగైదు చోటు చేసుకున్నాయి. వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వీధికుక్కల బెడద నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.