Hyderabad: ఒకరి సరదా.. మరొకరి ప్రాణం.. షేక్‌పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు
ఒకరి సరదా.. మరొకరి జవితాన్నే తలక్రిందుల చేసింది. సరదాగా ఇంట్లో నుంచి కారు తీసిన ఓ బాలుడు.. ఏకంగా ఫ్యామిలీ జీవితాన్నే మార్చేశాడు. నియంత్రించలేని వేగంతో కారు నడిపి రోడ్డుపై వెళ్తున్న ముగ్గురి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారు. హైదరాబాద్‌లోని షేక్‌ఫేట్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

నగరంలో మైనర్ల డ్రైవింగ్ పిచ్చి అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సరదాగా కారు నడపాలనే బాలుర ఉత్సాహం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తూ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు తెలిసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. వేగంగా వచ్చి అమాయకులపైకి దూసుకెళ్లిన ఆ కారు నడిపింది ఏజ్ బార్ లేని 16 ఏళ్ల మైనర్ బాలుడని విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ రాత్రి 11:50 గంటల సమయంలో రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు అత్యంత వేగంగా వెళ్తున్న కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్త దాస్ (26) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటు ఉన్న సౌమెన్ రాయ్ (27) తలకు తీవ్ర గాయాలు కాగా, అవిజిత్ రాయ్ (26) కుడికాలు విరిగి ఆస్పత్రిలో మరణమల్లాడుతున్నారు. వీరంతా రాయదుర్గం పోచమ్మ బస్తీలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.
మృతుడి సహచరుడు సౌరవ్ సంత్రా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారని, కారు నడిపింది 16 ఏళ్ల బాలుడేనని నిర్ధారించారు. లైసెన్స్ లేని మైనర్ కుమారుడికి కారు ఇచ్చిన వాహన యజమాని మహ్మద్ ఇమాదుద్దీన్ (48) పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అతనికి నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరమైన కేసు నమోదు చేశారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని, కేవలం మైనర్లనే కాకుండా వాహన యజమానులను కూడా జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
