Hyderabad: సూపర్ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతవాసులకు ఇది కదా కావాల్సింది.. ఏకంగా రూ. 488 కోట్లతో

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు అన్ని దిశలకూ కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. బుద్వేల్ లేఅవుట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ట్రంపెట్ జంక్షన్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది.

Hyderabad: సూపర్ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతవాసులకు ఇది కదా కావాల్సింది.. ఏకంగా రూ. 488 కోట్లతో
Hyderabad Flyover

Edited By:

Updated on: Jan 13, 2026 | 9:48 AM

హైదరాబాద్ నగర రహదారి వ్యవస్థకు మరో కీలక మలుపు రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు అన్ని దిశలకూ కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో హెచ్ఎండీఏ భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుద్వేల్ లేఅవుట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ట్రంపెట్ జంక్షన్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 488 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ట్రంపెట్ అందుబాటులోకి వస్తే నగరంలో వాహన రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా బాగా ఆదా కానుంది.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

బుద్వేల్ లేఅవుట్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్–2 వరకు, రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్‌చేంజ్‌ను అనుసంధానిస్తూ ఈ ట్రంపెట్‌ను నిర్మించనున్నారు. రేడియల్ రోడ్ నుంచి ఓఆర్ఆర్‌కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ వద్ద నిర్మించిన ట్రంపెట్ ఫ్లైఓవర్ తరహాలోనే ఈ కొత్త ట్రంపెట్‌ను కూడా ఆధునిక సాంకేతికతతో రూపొందించనున్నారు. కోకాపేట ట్రంపెట్ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంకర్‌పల్లి వైపు ట్రాఫిక్ గణనీయంగా తగ్గినట్లే, బుద్వేల్ ట్రంపెట్ కూడా అదే స్థాయిలో ప్రయోజనం చేకూర్చనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజన రహదారుల సముదాయంగా రూపుదిద్దుకోనుంది. ట్రంపెట్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ‘సీమ్‌లెస్ జర్నీ’ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రాజెక్టు వల్ల కొత్వాలూడ ఎకో పార్క్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సుమారు 24 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా. అయితే బుద్వేల్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి విస్తారంగా అందుబాటులో ఉండటంతో భూసేకరణ పెద్ద సమస్యగా మారదని చెబుతున్నారు. ఇదే సమయంలో నగరవ్యాప్తంగా రహదారుల విస్తరణపై కూడా హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రావిర్యాల–అమనగల్లు, బుద్వేల్–కోస్గి రేడియల్ రోడ్ల తరహాలోనే మరిన్ని మార్గాలు రూపుదిద్దుకోనున్నాయి. అదనంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు రూ.1,656 కోట్ల అంచనాలతో ఈ కారిడార్‌కు త్వరలో డీపీఆర్ రూపొందించనున్నారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే బంజారాహిల్స్, ఫిలింనగర్, నార్నెరోడ్, ఐటీసీ కోహినూర్, టీ–హబ్, శిల్పా లేఅవుట్ వరకు రాకపోకలు మరింత సులభమవుతాయి. అక్కడి నుంచి రాయదుర్గం, హైటెక్ సిటీకి వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. షేక్‌పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో కొత్త రహదారి నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మార్గం ద్వారా షేక్‌పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు చేరుకునే వీలుంటుంది. మొత్తంగా బుద్వేల్ ట్రంపెట్‌తో పాటు ప్రతిపాదిత రహదారి ప్రాజెక్టులు హైదరాబాద్‌ను మరింత స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మార్చే దిశగా కీలకంగా మారనున్నాయి.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..