AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వనదేవతల చెంత కేబినెట్ భేటీ.. మేడారంలోనే చారిత్రక సమావేశం..!

రాష్ట్ర పాలనలో అరుదైన అధ్యాయానికి తెరలేవనుంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈసారి అడవీ బాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల క్షేత్రంలోనే జనవరి 18వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

Telangana: వనదేవతల చెంత కేబినెట్ భేటీ.. మేడారంలోనే చారిత్రక సమావేశం..!
Telangana Cabinet Meet Likely At Medaram
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 13, 2026 | 9:28 AM

Share

రాష్ట్ర పాలనలో అరుదైన అధ్యాయానికి తెరలేవనుంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈసారి అడవీ బాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల క్షేత్రంలోనే జనవరి 18వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెప్పేలా ఈ నిర్ణయం ఉండటం విశేషం. అటవీ ప్రాంతంలో, గిరిజన దేవతల సన్నిధిలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ములుగు జిల్లా మేడారంలో జరగనున్న ఈ భేటీ చరిత్రలో నిలిచే విధంగా ఉండనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ ఇలాంటి ప్రయోగం జరగలేదు. పాలనను కేవలం భవనాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి తీసుకెళ్లే వినూత్న అడుగుగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని అక్కడే నిర్వహించి ఏర్పాట్లను నేరుగా పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో జాతర నిర్వహణకు సంబంధించిన నిధులు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న ఆరు గ్యారంటీల పురోగతిపై కూడా చర్చ జరగనుందని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 18న మధ్యాహ్నం మేడారం చేరుకుని కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. భేటీ అనంతరం అదే రాత్రి అక్కడే బస చేయనున్నారు. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల కోసం దావోస్ వెళ్లే షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. ఈలోగా మేడారం కేబినెట్ భేటీతో రాష్ట్ర పాలనలో మరో చారిత్రక మైలురాయిని ప్రభుత్వం నమోదు చేయనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..